![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 04:19 PM
ప్రభుదేవాతో విడాకులు తీసుకుని దశాబ్ద కాలం పైగా గడిచిన తర్వాత ఆయన మాజీ భార్య రమ్లత్ తాజాగా ఆయనపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా తమ పిల్లల పట్ల ప్రభుదేవా చూపిస్తున్న ప్రేమ, బాధ్యతలను ఆమె కొనియాడారు. ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమ్లత్ తమ ప్రస్తుత సంబంధం, పిల్లల పెంపకంలో ప్రభుదేవా పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.దాదాపు 16 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2011లో ప్రభుదేవా, రమ్లత్ విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, పిల్లల కోసం తామిద్దరం ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని రమ్లత్ తెలిపారు. "పిల్లలే ఆయన ప్రాణం. ఇద్దరు కుమారులతో ఆయనకు చాలా అనుబంధం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తండ్రీకొడుకులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు" అని ఆమె పేర్కొన్నారు. పిల్లలకు సంబంధించిన విషయాల్లో ఇద్దరం కలిసే నిర్ణయాలు తీసుకుంటామని, తల్లిదండ్రులుగా తమ నిబద్ధతను ఇది తెలియజేస్తుందని వివరించారు.ఇటీవల చెన్నైలో ప్రభుదేవాతో కలిసి వారి కుమారుడు రిషి వేదికపై నృత్య ప్రదర్శన ఇచ్చాడు. ఈ కార్యక్రమం తర్వాత రమ్లత్ ఇంటర్వ్యూ ఇచ్చారు. కుమారుడి ప్రతిభ చూసి గర్వంగా ఉందని చెబుతూనే, ఆ ప్రతిభ వెనుక తండ్రి ప్రభుదేవా ప్రభావం ఉందని ఆమె అన్నారు. "తండ్రి రక్తం పంచుకున్నందువల్లే ఆ మ్యాజిక్ సాధ్యమైందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు" అని ఆమె వ్యాఖ్యానించారు.గతంలో నటి నయనతారతో ప్రభుదేవా సంబంధం కారణంగా వారి విడాకుల సమయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. అయితే, ఆ గతాన్ని తాను పూర్తిగా వదిలేశానని రమ్లత్ స్పష్టం చేశారు. విడిపోయిన తర్వాత కూడా ప్రభుదేవా తనను ఎంతో గౌరవంగా చూసుకున్నారని, తన గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని ఆమె చెప్పారు. "విడిపోయాక నా గురించి ఆయన చెడుగా మాట్లాడి ఉంటే నాకు కోపం వచ్చేది, కానీ ఆయన అలా ఎప్పుడూ చేయలేదు. అలాంటి వ్యక్తి గురించి నేను కూడా చెడుగా మాట్లాడను" అని రమ్లత్ పేర్కొన్నారు."ఇది జీవితం, దీనిని అంగీకరించాలి" అంటూ తాను వాస్తవాన్ని స్వీకరించి ముందుకు సాగుతున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుదేవా రెండో వివాహం చేసుకుని, మరో కుమార్తెకు తండ్రి అయినప్పటికీ మొదటి భార్య, పిల్లల పట్ల ఆయన బాధ్యతగల తండ్రిగానే కొనసాగుతున్నారని రమ్లత్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.
Latest News