|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 02:27 PM
జబర్దస్త్' కామెడీ షో ద్వారా పాప్యులర్ అయిన హాస్యనటులలో 'బుల్లెట్ భాస్కర్' ఒకరు. 'ఐడ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన గురించిన అనేక విషయాలను పంచుకున్నారు. "సోషల్ మీడియాలోకి వెళ్లడం అంటే బట్టలిప్పి రోడ్డు మీదకు రావడం లాంటిది. ప్రతి ఒక్కరూ మనల్ని ప్రశ్నిస్తారు విమర్శిస్తారు. అనవసరంగా ఒకరితో అనిపించుకోవడం నాకిష్టం ఉండదు. అందుకే యూట్యూబ్ ఛానల్ పెట్టమని ఎంతమంది చెప్పినా నేను వినిపించుకోలేదు" అని అన్నారు. తన కుటుంబానికి ప్రైవసీ అవసరమని, అందుకే వారిని మీడియా ముందుకు తీసుకురానని తెలిపారు. గుర్తింపు తెచ్చే పాత్రలు రాలేదని, గుంపులో గోవిందలా కనిపించే పాత్రలు చేయడం తనకి ఇష్టం లేదని అన్నారు. నాన్-స్టాప్ గా 25 నిమిషాలు నటించే తాను, కెమెరా ముందు సులభంగా చేయగలననే ధీమా వ్యక్తం చేశారు. తాను చెప్పిన కథలు విని కొందరు చిన్న చిన్న మార్పులతో సినిమాలు తీసుకున్నారని, అందులో రెండు మూడు హిట్ కూడా అయ్యాయని, అప్పటినుంచి కథల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.భవిష్యత్తులో దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉందని, కంటెంట్ ఉన్న సినిమాలు తీసి విజయం సాధించగలననే నమ్మకం ఉందని భాస్కర్ తెలిపారు. ప్రస్తుతం ఫైనాన్షియల్ గా స్థిరపడటంపై దృష్టి పెట్టానని, ఈవెంట్లు, షోల ద్వారా అది సాధ్యమవుతుందని అన్నారు. ఇతరుల గురించి, వివాదాల గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని, తన గురించి ఎవరైనా మాట్లాడితే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుందని అన్నారు. తాను ఎవరి మాటా విననని, తనకు నచ్చినట్టు బతుకుతానని తేల్చి చెప్పారు.
Latest News