|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 01:25 PM
ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు, నిర్మాత బండ్ల గణేశ్, ఎస్వీ కృష్ణారెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "నా జీవితంలో ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా గురువుగారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయన నా తండ్రి లాంటి వారు," అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.చిన్నప్పటి నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించాలనే కోరిక బలంగా ఉండేదని, ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న సమయంలో ఎస్వీ కృష్ణారెడ్డి పరిచయమయ్యారని బండ్ల గణేశ్ తెలిపారు. "నేను షాద్‌నగర్ వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్న సమయంలో, నా మిత్రుడు శ్రీకాంత్ నన్ను షిరిడీ తీసుకెళ్ళాడు. అక్కడ దర్శనం చేసుకుని వస్తుండగా కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు కలిసి 'గణేశ్ నీకు వేషం ఇస్తాం, నువ్వు ఉండు' అని చెప్పారు" అని ఆనాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు."నాకు నటన రాకపోయినా, 'వినోదం' సినిమా ద్వారా నన్ను నటుడిగా పరిచయం చేశారు. ఆ సినిమాతో నాకు ఇండస్ట్రీలో నిలబడగలననే నమ్మకం వచ్చింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ గారు నన్ను నిర్మాతను చేశారు. నా జీవితం ఊహించని విధంగా సాగుతోంది" అని బండ్ల గణేశ్ వివరించారు. తనకు ఎలాంటి చెడు అలవాట్లు రాకుండా ఉండటానికి కారణం ఎస్వీ కృష్ణారెడ్డి అని, ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు తన ఇంటికి తీసుకెళ్ళి కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తూ జీవితంలో ఎలా నడుచుకోవాలో, ఇండస్ట్రీలో ఎవరితో ఉండకూడదో నేర్పిన మహానుభావుడని కొనియాడారు.
Latest News