|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 02:29 PM
రుద్ర విరాజ్ హీరోగా పరిచయమవుతూ అతనే దర్శకత్వం వహించిన సినిమానే 'వీరరాజు 1991'. అర్చన కథానాయికగా నటించిన ఈ సినిమా, మే 22వ తేదీన థియేటర్లకు వచ్చింది. అయితే పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వలన, ఈ సినిమా ఎప్పుడు థియేటర్లకు వచ్చి వెళ్లిందనేది చాలామందికి తెలియదు. అలాంటి ఈ సినిమా ఒక వారంలోనే 'ఆహా' ఓటీటీ ట్రాక్ పైకి వచ్చేసింది. ఈ సినిమా కథేమిటనేది తెలుసుకుందాం.
కథ: అది నెల్లూరు సముద్రతీరంలో ఒక గ్రామం. అక్కడి వాళ్లంతా మత్స్యకారులు. వాళ్లంతా సముద్రంపై ఆధారపడి జీవనాన్ని కొనసాగించేవారే. చేపల వేట తప్ప వారికి మరో పని తెలియదు. ఆ గ్రామస్తులకు అండగా నిలిచే యువకుడే పోతురాజు (రుద్ర విరాజ్). నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న పోతురాజును, ఆయన మరదలు 'వల్లీ' (అర్చన) ఇష్టపడుతూ ఉంటుంది. పదవి - అధికారం లేకపోయినా, ఆ గ్రామస్తులను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి 'దేవరాజు' ( అజయ్ ఘోష్) ప్రయత్నిస్తూ ఉంటాడు. సముద్రం నుంచి పోతురాజు మనుషులు తెచ్చిన చేపలకు దేవరాజు రేటు నిర్ణయించవలసిందే .. ఆయన కొనవలసిందే. అందువలన పోతురాజు మినహా మిగతా వాళ్లంతా ఆయనకి భయపడుతూ ఉంటారు. దేవరాజు కొడుకే శేషు. ఆడపిల్లల వెంటపడటం .. వేధించడం ఆయన పని. అలాగే ఒకసారి అతను 'వల్లీ'ని వేధించబోయి, పోతురాజు చేతిలో తన్నులు తింటాడు. అప్పటి నుంచి శేషు - పోతురాజు మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూ ఉంటుంది. ఈ సముద్రతీరం వైపుకు వచ్చిన ఒక్కొక్కరూ మిస్సవ్వడం మొదలవుతుంది. ఈ మిస్టరీని ఛేదించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు కూడా అదృశ్యమవుతూ ఉంటారు. దాంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తుంది. ఆ ఆఫీసర్ కి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? జరుగుతున్న సంఘటనలకు కారకులు ఎవరు? వల్లీతో పోతురాజు వివాహం జరుగుతుందా? అనేది మిగతా కథ.
Latest News