|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 09:46 PM
తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బిగ్ రిలీఫ్. గ్రూప్-1 ఉద్యోగాలపై గత కొంతకాలంగా కొనసాగుతోన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ ఊరటనిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. గ్రూప్-1 నియామకాలపై గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ విధించిన స్టేను సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 నియామకాలు సక్రమమేనని తెలిపింది. పరీక్ష పారదర్శకంగానే జరిగిందని తేల్చి చెప్పింది. గ్రూప్-1 పరీక్షలు నిర్వహణ, ఉద్యోగస్తుల ఎంపికలో అవకతవకలు జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది.
కాగా, గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, బయోమెట్రిక్ నిబంధనల అమలులో లోపాలు ఉన్నాయంటూ పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలోనే విచారణ జరిపిన సింగిల్ హైకోర్టు బెంచ్ ధర్మాసనం గ్రూప్-1 ఫలితాలను రద్దు చేస్తూ అప్పట్లో సంచలన తీర్పునిచ్చింది. అంతేకాకుండా.. గ్రూప్స్ రాసిన అభ్యర్థుల జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అవసరమైతే పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తూ గ్రూప్-1 నియామకాలపై స్టే విధించింది. ఈ తీర్పు అప్పట్లో సంచలనం సృష్టించింది.
దీంతో అప్పటికే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేశారు. హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం వెంటనే ఎంపికైన 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను కూడా అందజేసింది. అయితే, ఈ నియామకాలు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు ధర్మాసనం అప్పుడే స్పష్టం చేసింది. అయితే తాజాగా ఇవాళ వెలువడిన తుది తీర్పుతో 562 మంది గ్రూప్-1 అభ్యర్థులకు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే వీరు ట్రైనింగ్, ఉద్యోగ బాధ్యతల్లో చేరనున్నారు.