![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 12:35 PM
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ మనసు అల్లూరి సీతారామరాజు బయోపిక్ మీదకు పోయింది. గతంలో ఆయన 'వందేమాతరం' పేరుతో ఓ భారీ దేశభక్తి చిత్రాన్ని చిరంజీవితో తీయాలని తపించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అలానే బాలకృష్ణ తోనూ 'రైతు' అనే సినిమాను ప్లాన్ చేశారు. అదీ పట్టాలెక్కలేదు. అయితే... ఇప్పుడు అల్లూరి సీతారామరాజు బయోపిక్ చేయాలన్నది తన ఆలోచనగా కృష్ణవంశీ తెలియచేశారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తో కలిసి కృష్ణవంశీ, అనకాపల్లి జిల్లా గొలగొండ మండలం మేజర్ పంచాయితీ ఏజెన్సీ లక్ష్మీపురం గ్రామానికి సోమవారం వెళ్ళారు. అక్కడ అల్లూరి సీతారామరాజు, గంటం దొర సమాధులను వారు సందర్శించారు.అక్కడ కొంతసేపు గడిపిన కృష్ణవంశీ మాట్లాడుతూ, 'అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను సందర్శించాలనే చిరకాల కోరిక ఇప్పుడు తీరింద'ని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ గోపరాజు నారాయణరావు రాసిన 'ఆకుపచ్చ సూర్యోదయం' పుస్తకం తనను ఎంతో ఆకట్టుకుందని, దాదాపు ఇరవై సంవత్సరాల పాటు పరిశోధన చేసి ఆయన అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను గ్రంధస్థం చేశారని కృష్ణవంశీ చెప్పారు. దానిని చదివిన తర్వాత మన్యం వీరుడు అల్లూరి తిరిగిన ప్రదేశాలను చూడాలనే కోరిక మరింత బలపడిందని అన్నారు. అల్లూరి సీతారామరాజు జీవితాన్ని బేస్ చేసుకుని ఓ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచన తనకు ఎంతోకాలంగా ఉందని, దానికి సంబంధించిన పని కొంత కాలంగా చేస్తున్నానని కృష్ణవంశీ తెలిపారు. కృష్ణవంశీ గురించి యండమూరి మాట్లాడుతూ, 'దేశభక్తిని పెంపొందించే చిత్రాల దర్శకుడిగా కృష్ణవంశీ అంటే తనకు గౌరవం ఉందని, ఆయన తీసిన'ఖడ్గం' మూవీ తనకెంతో ఇష్టమ'ని చెప్పారు. కృష్ణవంశీ అల్లూరి బయోపిక్ గురించి తన మనసులో మాట చెప్పగానే చాలామంది దీనిని ఎవరితో ఆయన చేస్తారా అనే ఆలోచన మొదలు పెట్టారు. చిరంజీవితో 'వందేమాతరం' చేయలేక పోయిన కృష్ణవంశీ దానిని రామ్ చరణ్ తో అయినా చేయాలని అనుకున్నారు. అయితే... చెర్రీతో 'గోవిందుడు అందరివాడేలే' మూవీ చేశారు కృష్ణవంశీ. ఈ సినిమా ఘన విజయం సాధించకపోయినా... చిత్రబృందానికి మంచి పేరే తెచ్చిపెట్టింది. మూవీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఫిల్మ్ మేకర్స్ గా కృష్ణవంశీ అంటే ఇప్పటికీ చిరంజీవి, రామ్ చరణ్ కు అభిమానమే. ఇటీవల 'ట్రిపుల్ ఆర్' మూవీలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపించి మెప్పించిన రామ్ చరణ్.. కృష్ణవంశీ తెరకెక్కించబోయే అల్లూరి సీతారామరాజులో నటిస్తే బాగుంటుందని మెగాభిమానులు భావిస్తున్నారు. మరి అల్లూరి సీతారామరాజుగా కృష్ణవంశీ మనసులో ఎవరు ఉన్నారు? ఈ సినిమా ఎప్పుడు? ఎలా? ఎవరి ద్వారా సెట్స్ మీదకు వెళుతుంది అనేది వేచి చూడాలి.
Latest News