![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 12:39 PM
‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాల ఫేమ్ వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. నితిన్, శ్రీలీల జంటగా మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై యలమంచలి రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించారు. రాజేంద్రప్రసాద్, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 28న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు దర్శకుడు వెంకీ కుడుముల. ‘‘భీష్మ’ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయాలనుకున్నాను. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత నితిన్‌తో కలసి ఈ సినిమాను మొదలుపెట్టాను. ఇందులో హీరో పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. మాటలతో సునాయసంగా మనుషుల్ని గారడీ చేసే రకం. ఈ సినిమాకు మొదటి 20 నిమిషాలు చాలా ముఖ్యం. సినిమా అద్భుతంగా వచ్చింది. నితిన్‌కూ, నాకూ కెరీర్ బెస్ట్ చిత్రం అవుతుంది. నితిన్, రాజేంద్రప్రసాద్, శ్రీలీల పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. డేవిడ్ వార్నర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అవసరం ఉన్న వారి పక్షాన నిలబడే వాడే ‘రాబిన్‌హుడ్’. ఇదే ఈ సినిమా టైటిల్ ప్రధాన ఉద్దేశం. జి.వి ప్రకాశ్ సంగీతం ప్రధానాకర్షణ. ఈ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు.
Latest News