![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 12:48 PM
రూపేష్ కథానాయకుడిగా, నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'షష్టిపూర్తి'. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులు. ఆకాంక్ష సింగ్ కథానాయిక. పవన్ ప్రభ దర్శకుడు. ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చారు. విశేషం ఏమంటే ఇళయరాజా స్వరపర్చిన ఈ గీతానికి కీరవాణి రచన చేశారు. ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత కీరవాణి రచన చేసిన తొలి గీతం ఇది. దీనిని అనన్య భట్ గానం చేశారు. విశేషం ఏమంటే... 'ఏదో ఏ జన్మలోదో' అంటూ సాగే గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మంగళవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ, ''ఇళయరాజా గారిని ట్యూన్స్ కోసం చెన్నయ్ వెళ్ళి కలిసినప్పుడు ఆయన రెండు బాణీలు ఇచ్చారు. ఆ తర్వాత మూడో పాట ట్యూన్ కూడా తీసుకోమని అన్నారు. అయితే అది రెగ్యులర్ టైప్ సాంగ్ కాదు. ఆ పాటలో కథను చెప్పాలి. ఒక అమ్మాయి జీవితంలో జరిగిన విషయాలు అందులో విశదపర్చాలి. అప్పటికే మొదటి రెండు పాటలను రెహమాన్, చైతన్య ప్రసాద్ రాశారు. ఈసారి ఈ మూడో పాటను కాస్తంత భిన్నంగా ట్రై చేయాలనిపించింది. దానిని కీరవాణి గారితో రాయిస్తే ఎలా ఉంటుందని చైతన్య ప్రసాద్ ను అడిగాను. ఆయన బాగుంటుందనడంతో కీరవాణి గారిని సంప్రదించారు. ఆ టైమ్ లో ఆయన చెన్నయ్ లోనే ఉన్నారు. ఇళయరాజాగారి ట్యూన్ కు పాట అనేసరికీ ఆయన అంగీకరించారు. రాజా గారికి ఓ మాట చెప్పమన్నారు. ఆయన దగ్గరకు మేం వెళ్ళేలోగానే పల్లవిని రాసి పంపేశారు. ఆయన సాహిత్యం న భూతో న భవిష్యత్ అనిపించేలా ఉంది'' అని అన్నారు. అతి త్వరలో ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది.
Latest News