|
|
by Suryaa Desk | Mon, Apr 21, 2025, 03:39 PM
విజయ్ దేవరకొండ 'కింగ్ డమ్' అనే మూవీని చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే నాయికగా నటిస్తున్న ఈ సినిమా మే 30న విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసి, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుతున్నారు. చిత్రంలోని ప్రధాన తారాగణం డబ్బింగ్ లో పాల్గొంటోంది. విజయ్ దేవరకొండ సైతం తన వంతు పనిని పూర్తి చేశాడని అంటున్నారు. అయితే... ఇంత వేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నా... మే 30న సినిమాను విడుదల చేయగలమా? లేదా అనే సందేశంలో చిత్ర బృందం సతమతమౌతోందని తెలుస్తోంది.దీనికి ప్రధాన కారణం ఈ చిత్ర సంగీత దర్శకుడు. 'కింగ్ డమ్' మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థతో అనిరుధ్ కు ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. వారి నిర్మించిన 'అజ్ఞాతవాసి' సినిమాతోనే అనిరుధ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అలానే అదే సంస్థలో 'జెర్సీ' మూవీ చేశాడు. తెలుగులో చెప్పుకోదగ్గ కమర్షియల్ సక్సెస్ లను అనురుధ్ అందుకోకపోయినా... గత యేడాది వచ్చిన 'దేవర' ఆ లోటును తీర్చింది. ఇవాళ భారతీయ సినీ సంగీత దర్శకులలో అనిరుధ్ యమా బిజీ. అయినా ఏరి కోరి 'కింగ్ డమ్' మూవీకి అతన్ని సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు. ఇప్పుడు అతని కారణంగానే 'కింగ్ డమ్' నిర్మాతలు ఒత్తిడికి లోనవుతున్నారట! వివిధ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న అనిరుథ్ 'కింగ్ డమ్' రీ-రికార్డింగ్ కు సరైన స్లాట్ ను ఇవ్వలేకపోతున్నాడని తెలుస్తోంది. ఇలాంటి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాలకు నేపథ్య సంగీతమే ప్రాణం. మాస్ ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేయాలంటే... సంగీత దర్శకులు సరైన అవుట్ పుట్ ఇవ్వాలి. కానీ అనిరుధ్ ఈ తక్కువ సమయంలో అంత గొప్పగా నేపథ్య సంగీతం చేయగలడా... ఒకవేళ చేసినా... దానిని ఇన్ టైమ్ లో ఇవ్వగలడా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఒకవేళ 'కింగ్ డమ్' ముందు అనుకున్న విధంగా మే 30న రాకపోతే జూన్ కు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఇప్పటికే కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలు కర్చీఫ్ వేసి పెట్టాయి. కమల్ హాసన్, మణిరత్నం మూవీ 'థగ్ లైఫ్' జూన్ 5న రిలీజ్ అవుతోంది. ధనుష్, నాగార్జున నటిస్తున్న 'కుబేర' (Kubera) జూన్ 20న వస్తోంది. అలానే జూన్ నెలాఖరుకు 'కన్నప్ప' విడుదల అవుతోంది. సో... ఒక వేళ మే 30 డేట్ ను 'కింగ్ డమ్' మిస్ చేసుకుంటే... సోలో రిలీజ్ డేట్ కోసం జూన్ 13కు వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఈ పది, పదిహేను రోజుల్లో 'కింగ్ డమ్' రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వస్తుందేమో చూడాలి.
Latest News