|
|
by Suryaa Desk | Mon, Apr 21, 2025, 03:40 PM
కేజీయఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన యష్, కాస్త గ్యాప్ తీసుకొని ప్రస్తుతం టాక్సిక్ సినిమాలో నటిస్తున్నాడు. గీతు మోహన్‌దాస్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. యశ్ 19వ సినిమాగా వస్తున్న దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో యష్ రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న హిందీ చిత్రం 'రామాయణ'లో రావణుడిగా నటిస్తున్నాడనీ వార్తలు వచ్చాయి. అంతేకాదు... దీనికి యష్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తాడనే సమాచారమూ మీడియాలో చక్కర్లు కొట్టింది. లేటెస్ట్ గా దీనిపై బిగ్ అప్ డేట్ వచ్చింది.బాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ 'రామాయణ' షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది. సీతారాములుగా నటిస్తున్న సాయిపల్లవి, రణబీర్ కపూర్ పై కొన్ని కీలక సన్నివేశాలూ చిత్రీకరించారు. హిందీలో వచ్చిన 'ఆదిపురుష్' ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, పైగా పలు విమర్శలను ఎదుర్కోవడంతో రణబీర్ కపూర్ 'రామాయణ' ఏ స్థాయిలో ఉంటుందనే అనుమానులను పలువురు వ్యక్తం చేస్తున్నారు. 'ఆదిపురుష్'లో రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించగా, ఇప్పుడీ సినిమాలో ఆ పాత్రను యష్ పోషిస్తున్నాడు. 'దంగల్' తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న నితీష్ తివారీ 'రామాయణ'ను భారీ అంచనాల నడుమ తెరకెక్కిస్తున్నాడు. నిజానికి యష్ ఇప్పటికే 'రామాయణ' షూటింగ్ లో పాల్గొన్నాడనే వార్తలూ వచ్చాయి. అయితే అప్పుడు నితీశ్ కేవలం యష్ తో ఫోటో షూట్ మాత్రమే చేశాడని, షూటింగ్ జరపగలేదని అంటున్నారు. తాజాగా ఇప్పుడు అతను షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్టు ముంబై వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ కోసం యష్ ముంబైలో ఈ నెలాఖరులో ల్యాండ్ అవ్వబోతున్నాడట. విశేషం ఏమంటే చేస్తుంది రావణాసుడి పాత్ర అయినా... దైవభక్తి అమితంగా ఉన్న యష్... షూటింగ్ లో పాల్గొనడానికంటే ముందు దేవాలయాల సందర్శన చేయబోతున్నాడట. ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించి ఆపైన షూటింగ్ లో పాల్గొంటాడని సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం 'టాక్సిక్' షూటింగ్ లో పాల్గొంటున్న యష్... రావణ పాత్రకోసం ఏకంగా 20 కిలోల బరువు తగ్గాడని తెలుస్తోంది. చేస్తున్న సినిమాలు చేతి వేళ్ళ మీద లెక్కపెట్టేవే అయినా... యష్ మాత్రం చాలా సీరియస్ గా వాటి కోసం కష్టపడుతున్నాడు. ఈ యువ కథానాయకుడి విజయ రహస్యం ఇదే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
Latest News