|
|
by Suryaa Desk | Mon, Apr 21, 2025, 03:41 PM
ప్రముఖ కథానాయకుడు నితిన్ కొన్నేళ్ళుగా మంచి విజయం కోసం తహతహ లాడుతున్నాడు. ఈ యేడాది మార్చి 28న వచ్చిన 'రాబిన్ హుడ్' తో నితిన్ ఖచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తాడని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ 'రాబిన్ హుడ్' చిత్రం పరాజయం పాలైంది. గతంలో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల 'భీష్మ' మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయారు. ఇక నితిన్, అతని అభిమానులు తమ ఆశాలన్నీ 'తమ్ముడు' మూవీపైనే పెట్టుకున్నారు. నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మించిన 'దిల్' మూవీ అప్పట్లో ఘన విజయం సాధించినా, ఆ తర్వాత వీరి కాంబలో వచ్చిన 'శ్రీనివాస కళ్యాణం' ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో 'తమ్ముడు' మూవీని ఎలాగైనా సక్సెస్ చేయాలనే పట్టుదలతో దిల్ రాజు అండ్ టీమ్ ఉంది. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్ లోనే 'ఎం.సి.ఎ., వకీల్ సాబ్'' చిత్రాలను రూపొందించిన శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా ఈ యేడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ 'రాబిన్ హుడ్' రిలీజ్ డేట్ వాయిదా పడుతూ రావడంతో... 'తమ్ముడు' కూడా పోస్ట్ పోన్ అయిపోయింది. ఇప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి, జూలై 4న ఈ సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు భావించారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
Latest News