|
|
by Suryaa Desk | Mon, Apr 21, 2025, 03:45 PM
సంగీత దర్శకులు మెగా ఫోన్ పట్టడం కొత్తమీ కాదు. పాటలకు స్వరాలను సమకూర్చడంతో పాటు పాడటమూ అలవాటు ఉండే సంగీత దర్శకులు, నేపథ్య సంగీతం చేసినప్పుడు సినిమా మొత్తాన్ని మరో స్థాయికి తీసుకెళతారు. అలా సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, అర్థం చేసుకోవడం అలవాటైన వారికి దర్శకత్వం వహించాలనే కోరిక కలగడం సహజం. ప్రముఖ సంగీత దర్శకుడు, 'కేజీఎఫ్ , సలార్ ' వంటి చిత్రాలకు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ అదే పనిచేశారు. ఆయన కన్నడలో 'వీర చంద్రహాస' పేరుతో ఓ సినిమాను తెరకెక్కించారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్. ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ సమర్పణలో ఎన్.ఎస్. రాజ్ కుమార్ దీనిని నిర్మించారు. ఏప్రిల్ 18న విడుదలైన ఈ సినిమాకు చక్కని ఆదరణ లభిస్తోంది. తెలుగులోనూ ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేసేందుకు కంచి కామాక్షి కోల్ కతా కాళీ క్రియేషన్స్ అధినేత ఎం.వి. రాధాకృష్ణ సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ఈయన శివరాజ్ కుమార్ నటించిన 'వేద', ప్రజ్వల్ దేవరాజ్ నటించిన 'రాక్షస' సినిమాలను తెలుగులో విడుదల చేశారు. అతి త్వరలోనే 'వీర చంద్రహాస' విడుదల తేదీని తెలియచేస్తామని అన్నారు.
Latest News