|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 04:13 PM
సీనియర్ నటుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి సినీ పరిశ్రమలోని ప్రస్తుత పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన.... "ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలి" అన్న వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. "ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలి అని పవన్ కల్యాణ్ అనడంలో తప్పులేదు" అని ఆయన అన్నారు. అయితే, తన సినిమా 'హరిహర వీరమల్లు' ప్రస్తావన లేకుండా, కేవలం పరిశ్రమలోని సమస్యలపై చర్చించడానికి పవన్ పిలుపునిచ్చి ఉంటే ఆయనపై మరింత గౌరవం పెరిగేదని నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. జూన్ 1 నుంచి 'హరిహర వీరమల్లు' కోసమే థియేటర్లు బంద్ చేస్తున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. అది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. గద్దర్ అవార్డులను ప్రకటించడం గర్వంగా ఉందని, విజేతలకు అభినందనలు తెలిపారు. అలాగే, ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నంది అవార్డులను ప్రకటించాలని ఆయన కోరారు.సినిమా రంగంలో పర్సంటేజీల వివాదంపై నారాయణమూర్తి తీవ్రంగా స్పందించారు. "పర్సంటేజీ విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేనూ ఒకడిని. ఈ విషయంలో ఛాంబర్ ముందు టెంటు వేసి ఆందోళనలు చేశాం. ఎంతోమంది ఛాంబర్ ప్రెసిడెంట్‌లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పర్సంటేజీ ఖరారైతే తనలాంటి చిన్న నిర్మాతలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. పర్సంటేజీ విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో దానికి 'హరిహర వీరమల్లు' సినిమాకు లింకు పెట్టడం సరికాదని హితవు పలికారు. "బంద్ అనేది బ్రహ్మాస్త్రం. నేటి రోజుల్లో సింగిల్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకరమైంది. కార్పొరేట్ సిస్టమ్‌లకు వంత పాడుతున్నారు. మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి? సింగిల్ థియేటర్లు దేవాలయాల్లాంటివి. అవి ఇప్పుడు కళ్యాణమండపాలుగా మారుతున్నాయి. పర్సంటేజీని బతికించి నిర్మాతలను కాపాడాలి" అని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకులు ఓటీటీలో సినిమాలు చూస్తే ఇండస్ట్రీ నాశనమవుతుందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Latest News