|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 06:46 PM
పటాన్చెరు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు.కార్మికులకు మద్దతుగా బీఆర్టీయూ (BRTU) రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ అధ్యక్షతన పటాన్‌చెరు పట్టణంలోని ఐలా కార్యాలయం వద్ద నిర్వహించిన బైక్ ర్యాలీని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లు—వేతన కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తి భద్రత మరియు ఆరోగ్య కోడ్—కార్మిక రంగానికి తీవ్ర నష్టాన్ని కలిగించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలు ఉద్యోగ భద్రతను దెబ్బతీసి, కార్మికుల హక్కులను హరించేలా ఉన్నాయని విమర్శించారు.పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను రద్దు చేయడం దారుణమని పేర్కొన్న ఆయన, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న కార్మిక వర్గాన్ని అణగదొక్కడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు. పరిశ్రమల్లో కార్మిక సంఘాలను బలహీనపరచి, పెట్టుబడిదారులకు అనుకూలంగా లేబర్ కోడ్‌లను రూపొందించారని అన్నారు.ప్రత్యేకంగా, ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన నిబంధనలను సడలించడం, సమ్మె హక్కుపై ఆంక్షలు విధించడం, కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను ప్రోత్సహించడం వంటి అంశాలు కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి, లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు కార్మికులు సిద్ధమవుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గూడెం మధుసూదన్ రెడ్డి గారు, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు శివశంకర్ రావు గారు, కార్మిక నాయకులు నర్రా బిక్షపతి గారు, మాజీ కార్పొరేటర్ అంజయ్య గారు, చంద్రశేఖర్ గారు, కార్మికులు మరియు MPR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.