by Suryaa Desk | Wed, Nov 20, 2024, 04:30 PM
ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల పరిధిలోని ఖానాపూర్, దామరగిద్ద, అంతారం, గొల్లపల్లి, ఇబ్రహీం పల్లి, కౌకుంట్ల తదితర గ్రామాల్లోని కల్లు దుకాణాలపై మంగళవారం ఎక్సైజ్ శాఖ ఎస్ఐ ఖజా మొయినుద్దీన్, సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. కల్లు నమూనాలు సేకరించారు. మత్తు పదార్థాలు ఏవైనా ఉన్నాయా అని దుకాణాల వద్దే పరీక్ష చేశారు.
కల్లు నమూనాలను ల్యాబ్ కు పంపనున్నామని ఎస్ఐ తెలిపారు. మండలంలో ఎక్కడైనా కల్లులో కలిపే మత్తు పదార్థాలు నిల్వ చేసి ఉంటే ప్రజలు తమకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. కల్లు తయారీలో మత్తు పదార్థాలు వాడినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.