by Suryaa Desk | Thu, Nov 21, 2024, 07:21 PM
ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అఖండ భారతంలో వేర్వేరు న్యాయాలు ఏమిటని ఆమె అభిప్రాయపడ్డారు. అదానీపై అమెరికాలో లంచం ఇవ్వజూపినట్లుగా కేసు నమోదు కావడంతో ఆమె స్పందించారు.ఆధారాలు లేకపోయినప్పటికీ ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ అన్నారు. కానీ ఆధారాలు ఉన్నప్పటికీ అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని నరేంద్రమోదీ... అదానీ వైపే ఉంటారా? అని నిలదీశారు.అఖండ భారతంలో సెలెక్టివ్ న్యాయం అందిస్తున్నారని, రాజకీయ ప్రత్యర్థులను సాక్ష్యాలు లేకుండానే అరెస్ట్ చేసి నెలల తరబడి జైల్లో ఉంచుతున్నారని, కానీ అదానీపై పదేపదే ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదని ఇంగ్లీష్‌లోనూ ఆమె ట్వీట్ చేశారు. అదానీపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఆపుతోంది ఎవరు? అని ప్రశ్నించారు.కవిత చాలా రోజుల తర్వాత ఎక్స్ వేదికగా స్పందించారు. జైలు నుంచి బయటకు వచ్చాక ఆమె ఆగస్ట్ 29న సత్యమేవ జయతే అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత తన తండ్రి కేసీఆర్‌ను కలిసిన ఫొటోను ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కవిత కొన్ని నెలలు తీహార్ జైల్లో ఉన్నారు.