by Suryaa Desk | Wed, Nov 27, 2024, 11:20 PM
హైదరాబాద్ నగర పరిధిలోని చెరువుల పరిరక్షణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్లోని అన్ని చెరువులకు సంబంధించిన పూర్తి పర్యవేక్షణ తమదేనని హైకోర్టు స్పష్టం చేసింది. రామమ్మ చెరువు బఫర్‌జోన్‌లో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం (నవంబర్ 27న) రోజు హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్‌ఎండీఏ పరిధిలో మొత్తంగా 3532 చెరువులు ఉన్నాయని.. జులైలో జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం పేర్కొనగా.. వాటన్నింటికీ బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ను నిర్ధారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. ఈరోజు జరిగిన విచారణకు ప్రభుత్వం తరపున హాజరైన హెచ్ఎండీఏ కమిషనర్.. ఇప్పటివరకు 2793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసినట్లుగా ధర్మాసనానికి తెలిపారు. 530 చెరువులకు సంబంధించి తుది నోటిఫికేషన్లు పూర్తయినట్లుగా వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలోని అన్ని చెరువులకు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను నిర్ధరిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేసేందుకు మరో 3 నెలల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టును కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది. తదుపరి విచారణను డిసెంబరు 30వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ మహానగర పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నగరంలోని.. చెరువులు, కుంటల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తూ.. అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు పరుగెత్తించింది. అయితే.. ఈ కూల్చివేతల్లో కొంత మంది అమాయకుల నిర్మాణాలు కూడా ఉండటంతో.. వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ విషయంలో పలు పిటిషన్లు దాఖలు కాగా.. వాటిపై స్పందిస్తూ.. చెరువులు, కుంటలకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఎలా నిర్ధారిస్తున్నారు.. గతంలో అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా అవి అక్రమ కట్టడాలని ఎలా తేల్చుతారంటూ ప్రభుత్వాన్ని, హైడ్రాను నిలదీసింది. దీంతో.. చెరువులు, కుంటలకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించే పనిలో హైడ్రా నిమగ్నమైంది. హైడ్రా అంటే కూల్చటమే కాదు.. బాగు చేయటం కూడా అని నిరూపించేందుకు పలు చెరువులు, కుంటలను అభివృద్ధి చేసే కాకర్యక్రమాలను హైడ్రా చేపట్టింది.