by Suryaa Desk | Wed, Nov 27, 2024, 11:16 PM
తల్లిదండ్రులు చనిపోతే వారికి తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి తప్పించేవాడే కొడుకు అంటుంటారు. అలాంటి కొడుకు కోసం కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లి ఎన్నో కష్టాలకు ఓర్చుకుంటుంది. తన ప్రాణాన్ని పణంగా పెట్టి.. తన పేగు తెచ్చుకుని కొడుకుకు జన్మనిస్తుంది. తాను సగం కడుపుకే తిన్నా.. కొడుకుకు మాత్రం కడుపునిండేలా గోరుముద్దలు పెడుతుంది. చెమటోర్చి మరీ మంచి చదువులు చదివిస్తుంది. తన కొడుకు మంచి స్థాయిలో ఉంటే చూసి ఎంతగానో మురిసిపోతుంది. ఇన్నేళ్లు పడ్డ కష్టం మొత్తం మర్చిపోతుంది. ఫలితంగా ఆమె కోరుకునేది ఒక్కటే.. చివరి రోజుల్లో బుక్కెడు అన్నం పెట్టి.. చచ్చేవరకు ఇంట్లో కాస్త స్థానం ఇచ్చి.. చనిపోయిన తర్వాత తలకొరివి పెట్టి ఆ పున్నామ నరకం నుంచి తప్పించాలని.
కానీ.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమ కోసం తమ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారన్నది మర్చిపోయి.. పశువుల కన్నా అధ్వానంగా ప్రవర్తిస్తున్నారు. సరే.. వాళ్లు చూడట్లేదు.. వాళ్ల బతుకులేదో వాళ్లు బతుకుతున్నారని ఆ ముసలి ప్రాణాలు సర్ధిచెప్పుకుందామనుకున్నా.. ఆస్తులు అంతస్తులే కాదు ప్రభుత్వం ఇచ్చే నాలుగు పైసలు కూడా లాక్కుని రాబంధుల కంటే దారుణంగా మారుతున్నారు. అచ్చంగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది జగిత్యాలలో. బతికుండగానే తల్లిని శ్మశానానికి వెళ్లేలా.. ప్రత్యక్ష నరకాన్ని చూపించారు ఆ పున్నామ నరకం నుంచి తప్పించాల్సిన కొడుకులు.
జగిత్యాలకు చెందిన రాజవ్వ అనే వృద్ధురాలికి నలుగురు కుమారులు ఉన్నారు. కానీ.. వాళ్లను నవమాసాలు మోసి కని.. గోరుముద్దలు పెట్టి పెంచి పెద్ద చేసి బతుకు బాట చూపించిన తల్లి యోగక్షేమాలు చూసుకునేందుకు మాత్రం ఏ ఒక్కరికీ బాధ్యత లేకుండా పోయింది. జీవితం చివరి దశలో ఉన్న తన తల్లికి నాలుగు ముద్దలు పెట్టి ఆకలి తీర్చే బాధ్యత లేదు.. ఆమె ఆరోగ్యం ఎలా ఉందన్నది పట్టించుకునే సమయం లేదు కానీ.. ముదిమి దశలో ముసలివాళ్లు ఎవరిపై ఆధారపడకూడదని భావించి ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ డబ్బులు కూడా మిగిల్చకుండా రాబంధుల్లా పీక్కుతింటున్నారు ఆ కుమారులు.
వాళ్లు చూడకపోయినా పర్వాలేదు.. ప్రభుత్వం ఇచ్చే ఆ రెండు వేలతో అయినా నాలుగు ముద్దలు తిని, రెండు మాత్రలు వేసుకుని చచ్చేవరకు బతుకుదామని ఎవరిమీద ఆశలు పెట్టుకోని ఆ ముసలి ప్రాణానికి నరకం చూపిస్తున్నారు. సుమారు 8 రోజులుగా మోతే శ్మశానంలో ఆ వృద్ధురాలు చలికి వణుకుతూ, తిండీ నిద్రా లేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతుండగా.. కొందరు స్థానికులు గమనించి వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో.. వెంటనే ఆమెను చేరుకున్న వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు.. అసలు ఏం జరిగింది.. ఎందుకు శ్మశానంలో ఉన్నావని అడగ్గా.. చెప్పలేని స్థితిలో ఉన్న ఆ అవ్వ తన గోడు వెల్లబోసుకుంది. తనకు నలుగురు కుమారులున్నారని.. కానీ ఒక్కరు కూడా తనను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బుక్కెడు అన్నం పెట్టేందుకు చేతులు రావట్లేదు కానీ.. తన చేతికి వస్తున్న 2 వేల రూపాయల పింఛన్ డబ్బుల కోసం తనను కొట్టి బయటకు పంపించేశారని కన్నీళ్లు పెట్టుకుంది. బయటెక్కడో పడి చచ్చిపోతే కాల్చే దిక్కు కూడా లేకుండా పోతానేమో అని భయపడి.. చచ్చేవరకు ఇందులోనే ఉంటే.. చచ్చిపోయాక ఇందులోనే కాల్చేస్తారన్న ఉద్దేశంతో శ్మశానంలోకి వచ్చి ఉంటున్నట్టు తన గోస చెప్పుకుంది.
దీంతో.. ఆమెతో మాట్లాడి.. అర్థమయ్యేలా చెప్పి.. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి.. వసతి గృహానికి తీసుకెళ్లారు. ఆ వృద్ధురాలి కొడుకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వయోవృద్ధుల సంక్షేమాధికారి తెలిపారు. మన జన్మకు కారణమైన తల్లిదండ్రులు.. చివరి రోజుల్లో కోరుకునేది మీకు మేమున్నామని చిన్న భరోసా మాత్రమే. అది కూడా ఇవ్వలేకపోతే వాళ్లు ఇలా శ్మశానమే వెతుక్కుంటే.. మనం మాత్రం బతికున్నా శవాల కిందికే లెక్క. ప్రతి కొడుకు, కూతురు ఇలాంటి ఘటనలు చూసైనా మారాలని ఆశిస్తూ..!