|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 06:11 PM
హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ) అధికారులు.. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాకు సంబంధించి కీలక విషయం వెల్లడించారు. పంప్ హౌజ్‌లో పాత ఎలక్ట్రిక్ ప్యానెల్స్ స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకోసం నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో రెండు రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. పనులు పూర్తి అయిన తర్వాత తిరిగి యధావిధిగా మంచి నీటి సరఫరా కొనసాగించనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ నగర వాసులకు నిత్యం తాగునీటిని సరఫరా చేసే మంజీరా ఫేజ్-3, పెద్దాపూర్ పంప్‌లోని పంప్ హౌజ్‌లో మరమ్మత్తు పనులు జరుగుతున్నట్లు హైదరాబాద్ జలమండలి అధికారులు వెల్లడించారు. 35 ఏళ్లకు పైగా పాతబడిన హెచ్‌టీ (హై టెన్షన్) ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను తొలగించి.. వాటి స్థానంలో కొత్త ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈనెల 7, 8వ తేదీల్లో (శనివారం, ఆదివారం) సుమారు 36 గంటల పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.
ఈ హై టెన్షన్ ఎలక్ట్రిక్ ప్యానల్ మార్పు పనులతో పాటు పెద్దాపూర్ పంప్ నుంచి సింగాపూర్ వరకు ఉన్న 1600 మిల్లీమీటర్ల డయా పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వాల్వ్‌లను.. సింగాపూర్ నుంచి పెద్దాపూర్ వరకు ఉన్న 2000 మిల్లీమీటర్ల డయా గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వెంట్స్‌ను మార్చే మరమ్మతు పనులు కూడా చేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఈనెల 7వ తేదీ (శనివారం) ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు అంటే ఈనెల 8వ తేదీ (ఆదివారం) రాత్రి 8 గంటల వరకు ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 36 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో తక్కువ ప్రెజర్‌తో నీటి సరఫరా.. మరికొన్ని ప్రాంతాల్లో పూర్తి సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు పేర్కొన్నారు.
జలమండలి ఆపరేషన్, మెయింటనెన్స్ డివిజన్-3లోని షేక్‌పేట్ రిజర్వాయర్‌కు నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేయనున్నట్లు జలమండలి అధికారులు చెప్పారు. భోజగుట్ట ప్రాంతంలో లో ప్రెషర్‌తో మంచి నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. ఆపరేషన్, మెయింటనెన్స్ డివిజన్-18 పరిధిలోని కోకాపేట్, మణికొండ, నార్సింగి, మంచిరేవుల వంటి ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేస్తామని జలమండలి అధికారులు స్పష్టం చేసింది. ట్రాన్స్‌మిషన్-1, 2 పరిధిలో తాగు నీటి సరఫరాను పూర్తిగా ఆపనున్నట్లు అధికారులు తెలిపారు. నీటి సరఫరాకు సంబంధించి మరమ్మత్తు పనుల కారణంగా తాగు నీటి పంపిణీలో ఏర్పడే అంతరాయాన్ని నగర ప్రజలు గుర్తించాలని అధికారులు కోరారు. ప్రభావిత ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఉన్న నీటిని 36 గంటల పాటు పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేసింది.