|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 06:21 PM
తెలంగాణలోని 24 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలకు మహర్దశ పట్టనుంది. ఆయా కాలేజీల రూపు రేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఈ మేరకు కొత్తగా భవనాల నిర్మాణంతోపాటు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది. ప్రధానమంత్రి జన వికాస కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించనుంది. అందులో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని 18 కాలేజీలు, ఇతర జిల్లాల్లో ఆరు కాలేజీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మెుత్తంగా రూ.రూ.594 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఎక్కువగా ఉన్న కాలేజీలను ఈ పథకం కింద ఎంపిక చేశారు.
ఇంటర్ విద్యాశాఖ ఆయా ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికే అందజేయగా.. సీఎస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న రాష్ట్ర కమిటీ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నారు. మొత్తం నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా అంటే రూ.355.62 కోట్లు భరించనుంది. మిగిలిన 40 శాతాన్ని అంటే రూ.237.10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అత్యధికంగా హైదరాబాద్ నగరంలోని నాంపల్లి బాలుర కాలేజీకి రూ.40 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మిగిలిన 23 కాలేజీలకు రూ.24.20 కోట్ల చొప్పున ప్రతిపాదించారు. ఈ నిధులతో పాటుగా సమగ్ర శిక్షా ప్రాజెక్టు నిధులతో కాలేజీల్లో ల్యాబ్‌లను అభివృద్ధి చేస్తామని ఇంటర్ విద్యాశాఖ సంచాలకుడు వెల్లడించారు. కాలేజీల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
హైదరాబాద్ క్యూర్ పరిధిలోని కాలేజీలు..
నాంపల్లి బాలురు, బాలికలు (ఒకటే ప్రాంగణం), నాంపల్లి బాలికలు (ఉర్దూ), ఫలక్‌నుమా బాలురు, ఫలక్‌నుమా బాలికలు, గోల్కొండ కాలేజీ, మారేడుపల్లి బాలికలు, బోరబొండ బాలురు, హుస్సేనీఆలమ్ బాలికలు, సిటీ హైదరాబాద్ కళాశాల, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, బీహెచ్‌ఈఎల్, రాజేంద్రనగర్, పటాన్‌చెరు, మైసారం, కాచిగూడ, కూకట్‌పల్లి రామచంద్రాపురం కాలేజీలు.. జిల్లాల్లో నల్గొండ బాలికలు, ఆదిలాబాద్ బాలురు, ముథోల్, భైంసా, మహబూబ్‌నగర్ బాలికలు, నిజామాబాద్ బాలుర కాలేజీలు నిర్మించనున్నారు.