![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 11:43 AM
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇప్పుడిప్పుడే తెలుగు చిత్రసీమలో తన సత్తాను చాటుకుంటున్నాడు. ఆరేళ్ళ క్రితం 'దొరసాని' తో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండను 'బేబీ' సినిమా వంద కోట్ల క్లబ్ లో చేర్చింది. నిజానికి మొదటి సినిమా నుండి పట్టు వదలని విక్రమార్కుడిలా స్లో అండ్ స్టడీ అన్న రీతిలో ముందుకు సాగుతున్నాడు. కరోనా కాలంలో సైతం అతను నటించిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత సంవత్సరం వచ్చిన 'పుష్పక విమానం' నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత చిత్రం 'హై వే' తిరిగి ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యింది. నాలుగేళ్ళ ఆనంద్ దేవరకొండ సినీ ప్రయాణాన్ని ఒక్కసారిగా హై వేకు ఎక్కించిన చిత్రం 'బేబీ'. 2023లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కావడమే కాదు... నటుడిగానూ ఆనంద్ దేవరకొండకు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. సహజంగా చాలా మంది యువ హీరోల మాదిరే సక్సెస్ ను మేనేజ్ చేయడం ఆనంద్ దేవరకొండ కూ చేత కాలేదేమో అనిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలతో అతను సినిమాలు చేయడానికి అంగీకరించినా.... అవి సకాలంలో మాత్రం పూర్తి కాలేదు. 'బేబి' విజయం తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన 'గం గం గణేశా' గత యేడాది ఎట్టకేలకు విడుదలైంది. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.ఇక ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ లో కేఈ జ్ఞానవేల్ రాజాతో కలిసి 'దొరసాని' నిర్మాతల్లో ఒకరైన మధుర శ్రీధర్ రెడ్డి 'డ్యూయెట్' మూవీ మొదలెట్టారు. కానీ అది ఇంకా పూర్తి కాలేదు. రితిక నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మిధున్ వరద రాజ కృష్ణన్ తెరకెక్కిస్తున్నారు.ఇక 'బేబి' ఘన విజయం తర్వాత అదే నిర్మాణ సంస్థలో మరో సినిమాకు ఆనంద్ దేవరకొండ కమిట్ అయ్యాడు. అందులోనూ వైష్ణవి చైతన్యే హీరోయిన్. దర్శకుడిగా రవి నంబూరి వ్యవహరిస్తాడని నిర్మాతలు తెలిపారు. కానీ ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్ మాత్రం ఇంత వరకూ రాలేదు. తాజాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యతోనే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించింది. దీనిని 'నైన్టీస్: మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సీరిస్ ఫేమ్ ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్నాడు. సో... ఆనంద్ దేవరకొండ ప్రతికూల పరిస్థితుల్లోనూ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే... అందులో ఏవి, ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. మార్చి 15 ఆనంద్ దేవరకొండ బర్త్ డే. ఈ సందర్భంగా పలు నిర్మాణ సంస్థలు అతనికి జన్మదిన శుభాకాక్షలు తెలియచేస్తున్నాయి.
Latest News