![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 11:34 AM
యంగ్ టైగర్ యన్టీఆర్ నటించిన 'వార్-2' కోసం ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో వింతేముందని అనుకోవచ్చు. కానీ నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ సైతం యంగ్ టైగర్ హిందీ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉండడమే విశేషం! గతంలో వచ్చిన హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ 'వార్' సినిమా ఫ్రాంచైజీలో రెండో భాగంగా 'వార్-2' వస్తోంది... ఇందులోనూ హృతిక్ రోషన్ నటిస్తున్నారు. హృతిక్ కు ఉత్తరాదిన ఎంతటి ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. కానీ, డబ్బింగ్ మూవీస్ తోనే నార్త్ లో తన సత్తా చాటుకున్న యంగ్ టైగర్ ను స్ట్రెయిట్ హిందీలో చూడాలని అక్కడి ఫ్యాన్స్ తహతహలాడుతున్నారన్న మాట. అందులో భాగంగానే ఫ్యాన్స్ పోటీలు పడి మరీ టీజర్స్ ను సొంతగా తయారు చేస్తున్నారు.యన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 'వార్-2' ఆయన తొలి హిందీ చిత్రమని ప్రచారం సాగుతోంది. అయితే తెలుగునాట అభిమానులు మాత్రం యన్టీఆర్ బాలనటునిగానే ఏ నాడో హిందీ చిత్రంలో నటించేశారని గుర్తు చేస్తున్నారు. 1991లో నటరత్న యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'ను తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. ఆ సినిమా తెలుగు వర్షన్ రిలీజయిన కొన్నాళ్ళకు హిందీ వెర్షన్ ను రీ షూట్ చేశారు. అందులో బాల భరతునిగా జూనియర్ యన్టీఆర్ నటించారు. ఆ సినిమా కొన్నేళ్ళ తరువాత ఉత్తరాదిన కొన్ని సెంటర్స్ లో విడుదలయింది. 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' ఇటు తెలుగులోనూ, అటు హిందీలోనూ ఆట్టే ఆకట్టుకోలేక పోయింది. కాకపోతే జూనియర్ యన్టీఆర్ తెరపై తళుక్కుమన్న తొలి చిత్రంగా హిందీ 'విశ్వామిత్ర' నిలచింది. అలా తాత డైరెక్షన్ లోనే మనవడు హిందీ ఎంట్రీ ఇచ్చాడన్న విషయాన్ని యంగ్ టైగర్ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.
Latest News