|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 10:39 PM
తెలంగాణలో కొన్ని రోజుల క్రితం సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ మరణం.. ఆ తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మరణం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. వేర్వేరు ఘటనల్లో నిందితులతో పోరాడుతూ.. తీవ్రంగా గాయాలపాలై చికిత్స పొందుతూ వీరిద్దరూ ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఈ ఇద్దరి కుటుంబాలను ఆదుకునేందుకు వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నిజామాబాద్ పర్యటనలో భాగంగా.. ప్రమోద్ కుమార్ కుటుంబానికి రూ.1 కోటి చెక్కు.. సౌమ్య కుటుంబానికి రూ.1కోటి చెక్కును అందించారు.
గత నెల 23వ తేదీన నిజామాబాద్‌లో అక్రమ గంజాయి తరలిస్తున్న ముఠా ఆటకట్టించేందుకు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తన ప్రాణాలకు తెగించి ప్రయత్నించారు. నిందితులను పట్టుకునేందుకు తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా సౌమ్య విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఆ గంజాయి ముఠా.. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను తమ వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటనలో సౌమ్యకు తీవ్రగాయాలు అయ్యాయి.
దీంతో ఆమెను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కొన్నిరోజుల పాటు ట్రీట్‌మెంట్ తీసుకున్న సౌమ్య.. ఇటీవలె మృతిచెందారు. సౌమ్యను కాపాడేందుకు నిమ్స్ డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఆమె ప్రాణాలు దక్కలేదు. దీంతో విధి నిర్వహణలో సౌమ్య చూపించినన ధైర్యసాహసాలను గుర్తించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఆమె కుటుంబానికి తక్షణం ఆర్థిక భరోసాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చింది.
మరోవైపు.. గతేడాది అక్టోబర్ నెలలో డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్‌పై దుండగుడు కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో ప్రమోద్ కుమార్ తీవ్రంగా గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా అందించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించి వారు చేసిన కత్తిపోట్లతో ప్రమోద్ కుమార్ మరణించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం అర్పించిన ఈ ఇద్దరు కానిస్టేబుళ్ల త్యాగం తెలంగాణ సమాజం మరువదని.. వారి కుటుంబాలకు అన్ని రకాలుగా రక్షణగా ఉంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.