![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 13, 2025, 11:59 AM
రాజకీయ నాయకుల పరిస్థితి ఒక్కోసారి అరటి ఆకును గుర్తు చేస్తుంది. ముల్లు వెళ్ళి అరటి ఆకు మీద పడ్డా... అరటి ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా అరటి ఆకుకే నష్టం. తమిళ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్ లోనే ఉన్నారు. సినిమాకు స్వస్తి చెప్పి, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా కొనసాగాలని భావించిన విజయ్ 'తమిళ వెట్రి కళగం' పార్టీని స్థాపించాడు. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రచారాన్ని కూడా మొదలెట్టేశాడు. వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ సత్తాను చాటాలని విజయ్ తహతహ లాడుతున్నారు. ఇందులో భాగంగా రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం లకు విజయ్ ఇఫ్తార్ విందు ఇచ్చాడు. ఘనంగా జరిగిన ఈ విందు... ఇప్పుడు అతన్ని చికాకు పరుస్తోంది. దీనికి కారణం హిందువులు కాదు... ముస్లింలోని ఓ వర్గం వారే! నిజానికి విజయ్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరైన ముస్లిం వర్గాలు తమ హర్షాన్ని వ్యక్తం చేశాయి. విజయ్ చాలా మంచి విందును ఇచ్చాడని ప్రశంసించాయి. అయితే... అదే ఇఫ్తార్ విందుపై కొందరు ముస్లిమ్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపవాసం చేయకుండా ఇఫ్తార్ విందు ఇవ్వడాన్ని తప్పు పట్టారు. అంతేకాదు... ఆ విందు సందర్భంగా విజయ్ సెక్యూరిటీ సిబ్బంది ముస్లింలతో చాలా అనుచితంగా వ్యవహరించారని విమర్శించారు. తమని అత్యంత దారుణంగా ఇవతలకు ఈడ్చి పడేశారని వాపోయారు. విజయ్, అతని సిబ్బంది ప్రవర్తన చూస్తుంటే ఆ విందులో రౌడీలు, దుండగులు పాల్గొన్నట్టు అనిపించిందన్నారు. రంజాన్ పట్ల ఏ మాత్రం గౌరవం లేని వారికి ఎలా ఇఫ్తార్ విందు ఇస్తారని వారు దుయ్యబట్టారు. మరీ ముఖ్యంగా తమిళనాడు సున్నత్ జమాత్ కోశాధికారి సయ్యద్ మీడియా ముందుకొచ్చి విజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమను అవమానించిన విజయ్ పై కేసు నమోదు చేయాలంటూ చెన్నయ్ పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు.విజయ్ పై వస్తున్న విమర్శలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగా విజయ్ ను టార్గెట్ చేయడానికే కొందరు ఇలా విమర్శిస్తున్నారని కొందరు అంటున్నారు. రాజకీయాలలోకి వచ్చిన వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహజమని, ప్రత్యర్థి పార్టీలే ఇలాంటి వారిని ఉసికొల్పుతారని చెబుతున్నారు. ఓ స్టార్ హీరో ఇచ్చిన ఇఫ్తార్ విందులో గందరగోళం చోటు చేసుకోవడం అనేది అత్యంత సహజమని, దానిని బూతద్దంలో చూస్తూ విమర్శించడం సరికాదని అంటున్నారు. ఇదిలా ఉంటే విజయ్ నటిస్తున్న చివరి చిత్రం 'జన నాయగన్' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే యేడాది పొంగల్ కానుకగా ఈ సినిమా జనం ముందుకు రానుంది. ఇందులో విజయ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.
Latest News