|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 08:55 PM
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన మెగా బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన ప్రజెంట్ చేశారు. నయనతార కథానాయికగా నటించారు. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభించగా, సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మెగా బ్లాక్‌బస్టర్ థ్యాంక్ యూ మీట్ నిర్వహించింది.థ్యాంక్ యూ మీట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “మళ్లీ మళ్లీ ఇలాంటి మంచి సినిమాలు తీసి ప్రేక్షకులను ఆనందింపజేయడం ద్వారానే నా కృతజ్ఞతను తెలియజేస్తాను. నా కెరీర్‌లో అతి వేగంగా పూర్తైన స్క్రిప్ట్ ఇదే. కేవలం 25 రోజుల్లో ఈ కథను పూర్తి చేయగలిగాను. దానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి గారే” అన్నారు.“చిరంజీవి గారిని ఒక స్టార్‌గా కాకుండా సగటు ప్రేక్షకుడు ఎలా అభిమానిస్తాడో ఆ కోణంలో ఆలోచించాను. కూల్‌గా డైలాగులు చెప్పాలంటే చిరంజీవి, కంటి నుంచి కన్నీళ్లు పడకుండా ప్రేక్షకులను ఏడిపించాలంటే చిరంజీవి, గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ చేయాలంటే చిరంజీవి, వందమంది ఫైటర్ల మధ్య నిలబడి ఒక ఆటిట్యూడ్ చూపించాలంటే చిరంజీవి… నటనలోని నవరసాలన్నిటినీ తన మార్క్ స్టైల్‌తో ప్రేక్షకులకు అందించిన లెజెండ్ ఆయనే” అని చెప్పారు.“అందుకే కథ రాస్తున్నప్పుడు చిరంజీవి గారిలోని అన్ని ప్రత్యేకతలను కలుపుకుంటూ వెళ్లాను. ఆయన ఎన్నో దశాబ్దాలుగా ప్రేక్షకులను ఎలా అలరించారో అవన్నీ ఈ స్క్రిప్ట్‌లో ప్రతిబింబించాయి. అందుకే స్క్రిప్ట్ అంత ఫాస్ట్‌గా పూర్తైంది. ఇందులో రాసిన ప్రతి సీన్‌కు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే. ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే చెందుతుంది” అని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.చిరంజీవి గారితో పని చేసిన 85 రోజులు తన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలుగా నిలిచాయని, ఆయన అనుభవాన్ని అందరితో పంచుకుంటూ ఒక సాధారణ మనిషిలా టీమ్‌ను నడిపించిన తీరు తనను ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పారు. మెగా ఫ్యాన్స్ నుంచి వస్తున్న అపారమైన ప్రేమ తనకు గొప్ప ఆనందాన్ని ఇస్తోందని కూడా పేర్కొన్నారు.ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన సాహు గారపాటి గురించి మాట్లాడుతూ, “విజయం వచ్చినా, అపజయం వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి సాహు. ఇంత పెద్ద బడ్జెట్, స్టార్ కాస్ట్‌తో సినిమాను అద్భుతంగా నిర్మించారు” అన్నారు. సుస్మిత కొణిదెలకు ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని, చిరంజీవి గారి సినిమాతో ఆమె కల నెరవేరినందుకు అభినందనలు తెలిపారు.సమీర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాష్ వేసిన సెట్లు, బీమ్స్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని చెప్పారు. నయనతార, వెంకటేష్ చేసిన పాత్రలు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన పొందుతున్నాయని, ముఖ్యంగా ఇద్దరు స్టార్స్ కలిసి డ్యాన్స్ చేసిన సీన్స్ థియేటర్లలో హోరెత్తిస్తున్నాయని పేర్కొన్నారు.ప్రొడ్యూసర్ సాహు గారపాటి మాట్లాడుతూ, “మెగాస్టార్‌తో సినిమా చేయడం ఎవరికైనా ఒక పెద్ద కల. ఈ సినిమా బాక్సాఫీస్ బాస్‌గా నిలుస్తుందని ముందే నమ్మకం ఉంది. ప్రేక్షకులు సినిమాను అద్భుతంగా ఆదరిస్తున్నారు” అన్నారు.సుస్మిత కొణిదెల మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఘనంగా ఆదరిస్తున్నారు. కలెక్షన్స్, టాక్ అద్భుతంగా ఉన్నాయి. నాకు ఇది ఎంతో గర్వకారణం” అని అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ మాట్లాడుతూ, “నా కెరీర్‌లో ఇది ఒక సిల్వర్ జూబ్లీ మూవీ. ఈ సందర్భంలో మెగాస్టార్‌తో బ్లాక్‌బస్టర్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది” అన్నారు.ఈ వేడుకలో సినిమా యూనిట్ సభ్యులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ విజయాన్ని సంబరంగా జరుపుకున్నారు.
Latest News