|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 07:31 PM
సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో యువ హీరో హవీష్, కావ్య థాపర్ జంటగా వస్తున్న చిత్రం నేను రెడీ. పూర్తి వినోదత్మాక కుటుంబ చిత్రంగా ఈ చిత్రం శర వేగంగా రూపుదిద్దుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే దిశగా అన్ని హంగులతో భారీ చిత్రంగా సిద్ధమవుతోంది. హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి పతాకంపై నిఖిల కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం మిక్కి జె మేయర్. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ డ్రాగన్ ప్రకాష్ నేత్రుత్వంలో భారీ యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్ లోని చిరాన్ ఫోర్ట్ క్లబ్ లో చిత్రీకరించారు. అలాగే బ్రహ్మానందం, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, హరితేజ, బలగం సత్యనారాయణ వంటి నటి నటులతో అనేక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పటికే 95 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకోగా పాండిచ్చేరిలోని లొకేషన్స్ లో పాటల చిత్రీకరణ చేయనున్నారు. ఆద్యంతం వినోదం, ప్రేమ అంశాలతో పాటు కుటుంబ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. నువ్విలా చిత్రంతో వెండితెర ప్రవేశం చేసిన హవీష్ తరువాత అనేక చిత్రాల్లో నటించినా మిశ్రమ స్పందన లభించింది. ఈసారి ఖచ్చితంగా సక్సెస్ కొట్టాలనే పట్టుదలతో హవీష్ ఉన్నాడు.
Latest News