![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 13, 2025, 12:08 PM
వచ్చే నెలలో గద్దర్ తెలంగాణఫిల్మ్ అవార్డులను ప్రదానం చేయనున్నట్టు రాష్ట్ర చలన చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్‌రాజు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం 2014నుంచి 2023 వరకు పదేళ్ల కాలంలో వచ్చిన చిత్రాలలో ప్రతి ఏడాది ఒక ఉత్తమ సినిమా ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. బుధవారం మాసాబ్‌టాంక్‌లోని సంస్థ కార్యాలయంలో దిల్‌రాజు విలేకరులతో మాట్లాడుతూ ఉర్దూలో వచ్చిన సినిమాలకు ప్రత్యేకంగా ‘ఉత్తమ సినిమాఉర్దూ’ అవార్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ సినీ దర్శకులు బి.నర్సింగ్ రావు అధ్యక్షతన రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన విధి విధానాల రూపకల్పన కమిటీ సిఫారసుల మేరకు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డుల తరహాలోనే సినీ రంగంలోని వివిధ విభాగాల్లో ప్రతిభావంతులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్టు వివరించారు. గత ప్రభుత్వం సింహా పేరుతో ఫిల్మ్ అవార్డులు ప్రదానం చేయనున్నట్టు ప్రకటించడంతో పలువురు చలనచిత్ర పరిశ్రామిభివృద్ధి సంస్థకు దరఖాస్తులతో పాటు కట్టిన డబ్బులను తిరిగి వాపస్ ఇవ్వనున్నట్టు దిల్‌రాజు పేర్కొన్నారు. 2024లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ రంగంలో వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ఇవ్వనున్నట్లు వివరించారు. దరఖాస్తులు అందిన తర్వాత గద్దర్ అవార్డ్స్ కోసం ఏర్పాటైన జ్యూరీ కమిటీ ఒక వారం రోజుల్లో అవార్డు విజేతలను ఖరారు చేస్తుందన్నారు. డాక్టర్ ఎం.ప్రభాకర్‌రెడ్డి పేరిట ఉత్తమ ప్రజాదరణ చిత్రానికి అవార్డు ప్రదానం చే యనున్నట్టు తెలిపారు. అలాగే పైడిజయరాజు,కాంతారావుల పేరిట ప్రత్యేక అవార్డులు అందించనున్నట్టు తెలిపారు.
Latest News