by Suryaa Desk | Sat, Nov 23, 2024, 07:31 PM
తెలంగాణలోని విద్యార్థులు రేవంత్ రెడ్డి సర్కార్ మరో భారీ శుభవార్త వినిపించింది. రాష్ట్రంలోని విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించతలపెట్టింది. కాగా.. ఇప్పటికే రాష్ట్రంలోని 28 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. కాగా.. వర్గ, వర్ణ, మత భేదాలేవీ లేకుండా సమాజంలోని విద్యార్థులంతా ఒకేచోట.. కార్పొరేటే విద్యాసంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నంలో భాగంగానే.. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నట్టు ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలోనే.. రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తాజాగా.. మరో 26 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ బీ.వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల, ధర్మపురి, చొప్పదండి, పెద్దపల్లి, రామగుండం, బోధన్, డోర్నకల్, వైరా, సత్తుపల్లి, కోదాడ, కొత్తగూడెం, నాగార్జున సాగర్, నకిరేకల్, తాండూరు, మక్తల్, నారాయణ్ పేట, జుక్కల్, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, వికారాబాద్, చేవేళ్ల, మెదక్, మేడ్చల్ నియోజకవర్గాలకు కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రభుత్వం మంజూరు అయ్యాయి.
అయితే.. అక్టోబర్ 11వ తేదీన ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అదే రోజున మొదటి విడతలో మంజూరైన 28 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించగా.. ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.26 కోట్లు ఖర్చు చేయనుంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మి్స్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో.. ఒక్కో దాంట్లో 2,560 మంది విద్యార్థులు.. నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు చదువుకోనున్నారు. వీటిల్లో వేర్వేరు బ్లాక్‌లు ఉంటాయి. ప్రతి స్కూల్లో 30 మంది చొప్పున 120 మంది టీచర్లు విధులు నిర్వహించనున్నారు. సుమారు 5 వేల పుస్తకాలతో లైబ్రరీ, 60 కంప్యూటర్లతో ల్యాబ్‌తో పాటు అన్ని తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పాఠశాలలో ఆడిటోరియం, ఇండోర్ స్పోర్ట్స్ స్డేడియాలాలతో పాటు క్రికెట్, ఫుట్‌బాల్ మైదానాలు, బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్ కోర్టులు, ఔట్‌డోర్ జిమ్, థియేటర్, ల్యాండ్‌స్కేప్ కోర్టులు వంటి అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.