by Suryaa Desk | Sat, Nov 23, 2024, 10:06 PM
తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-విజయవాడ హైవే రద్దీగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎక్కువగా హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రాకపోకలు సాగిస్తుంటారు. ప్రతి నిత్యం ఈ రహదారిపై వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. రాయలసీమ ప్రాంతానికి వెళ్లేవారితో పాటుగా.. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేవారు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో హైవే విస్తరణకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రహదారిపై పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ మార్గాన్ని విస్తరించేందుకు ఎన్హెచ్ఏఐ కసరత్తు చేస్తోంది.
తెలంగాణలోని మన్ననూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం వరకు హైవే విస్తరణ పనులు చేపట్టనున్నారు. విస్తరణలో భాగంగా నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఈ కారిడార్ నిర్మాణానికి కృష్ణా నది ప్రాంతం కీలకం కానుంది. కృష్ణా ఆనకట్ట దిగువన నదిని దాటేచోట నాలుగు వరుసలతో ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. అందుకు సంబంధించిన డిజైన్ ఇప్పటికే రూపొందించారు. ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే శ్రీశైలానికి తొమ్మిది కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం శ్రీశైలం వెళ్లే రోడ్డుమార్గంలో ఈగలపెంట మీదుగా పాతాలగంగ దాటాక కృష్ణా నదిపై ఓ వంతెన ఉంది. ఆ వంతెన దాటితే ఆంధ్రప్రదేశ్ పరిధి ప్రారభం అవుతంది. అయితే నదికి ఇరువైపులా ఎత్తైన కొండల పైనుంచి కింది వరకు అనేక మూల మలుపులతో ప్రమాదకర ఘాట్ రోడ్డు ఉంటుంది. కృష్ణా నది దాటి ఏపీలో ప్రవేశించాక మళ్లీ ఘాట్ రోడ్డు మలుపులు తిరుగుతూ కొండపైకి చేరుకుంటుంది. ఈ మార్గంలో అధిక దూరం, సమయం, ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కృష్ణా నదిపై కొత్తగా ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని కేంద్రం ప్రతిపాదించింది.
కృష్ణా నదిపై ప్రస్తుత రోడ్డుకు, శ్రీశైలం డ్యాంకు మధ్యలో వంతెన ఎలైన్‌మెంట్‌ను ఇప్పటికే ఖరారు చేశారు. కృష్ణా మీదున్న ప్రస్తుత రోడ్డును విస్తరించకుండా ‘బైపాస్’గా కొత్త మార్గాన్ని డిజైన్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వంతెన గరిష్ఠ ఎత్తు 173 మీటర్లుగా ఉంటుందని చెప్పారు. నది మీదుగా సాగే ఎలివేటెడ్ కారిడార్ సున్నిపెంట అవతలి వరకు... దాదాపు శ్రీశైలం వరకు సాగుతుందన్నారు. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు పొడవు మెుత్తం 62.5 కి.మీ కాగా.. ఇందులో 56.2 కి.మీ. అటవీమార్గం ఉంటుంది. మరో 6.3 కి.మీ. అటవీయేతర ఉండనుండగా.. మొత్తంగా 47.82 కి.మీ. పొడవున ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లై ఓవర్)గా రహదారిని నిర్మించనున్నారు.
హైదరాబాద్-శ్రీశైలం నాలుగు వరుసల కారిడార్ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.7,688 కోట్లు కాగా.. కేంద్ర అటవీ శాఖ అనుమతుల కోసం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్-శ్రీశైలం-నంద్యాల హైవే ఎన్నెన్నో అందాలకు నెలవు. నల్లమల అడవి మీదుగా సాగే ఈ మార్గంలో కృష్ణా నది, ఘాట్‌రోడ్లు. అద్భుతమైన శ్రీశైలం డ్యాం, ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం, ఆక్టోపస్, ఫర్హాబాద్ వ్యూపాయింట్లు, టైగర్ సఫారీ, సలేశ్వరం, ఉమామహేశ్వర ఆలయాలు టూరిస్టుల మనసు దోస్తాయి. ఈ జాబితాలో ఐకానిక్ వంతెన కూడా చేరనుంది.