![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 11:24 AM
కాకినాడ శ్రీదేవి .. 'కోర్ట్' సినిమా చూసినవారికి ఈ బ్యూటీని కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలలో .. ఈవెంట్స్ లో ఈ అమ్మాయిని చూశారు గానీ పెద్దగా పట్టించుకోలేదు. గ్లామరస్ గా కనిపించలేదు గానీ, ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ మాత్రం ఉందని అనుకున్నారు. అయితే నిన్న విడుదలైన ఈ సినిమాకి వెళ్లినవాళ్లు ఈ అమ్మాయికి అభిమానులు కాకుండా బయటకి రాలేకపోయారు. అందుకు కారణం ఆ అమ్మాయి సహజమైన నటన అనే చెప్పాలి. శ్రీదేవి ఇంతకుముందు ఒకటి రెండు సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేసిందట .. ఈ విషయాన్ని ఇంటర్వ్యూలలో తనే చెప్పింది. కాకపోతే ఆ సినిమాలను ఇప్పుడు చూస్తేనే తప్ప మనం గుర్తుపట్టలేం. కాకినాడలో ఇంటర్ చదువుకుంటూ .. రీల్స్ చేసుకుంటూ వెళుతున్న ఈ అమ్మాయికి ఈ సినిమా నుంచి ఛాన్స్ వెళ్లింది. అయితే వచ్చిన అవకాశాన్ని ఈ బ్యూటీ వదులుకోలేదు. 'జాబిల్లి'గా తన పాత్రలో గొప్పగా నటించింది. ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్ట్ ల కళ్లతోనే హావభావాలను పలికించింది. చందు కాల్ చేసినప్పుడు బ్యాగులో ఫోన్ లిఫ్ట్ చేస్తూ దొరికిపోయే సీన్ లో .. తాను ఏ తప్పూ చేయలేదని తల్లిని హత్తుకునే సీన్లో .. కోర్టులో చందును చూసి ఉద్వేగానికి లోనయ్యే సన్నివేశంలో .. క్లైమాక్స్ సీన్ లోను ఆ అమ్మాయి నటనను మరచిపోలేము. ముఖ్యంగా ఓ పెళ్లికి వెళ్లినప్పుడు, మేడపైకి రమ్మని చందుకు కళ్లతో చేసే 'సైగ' ఒక్కటి సరిపోతుంది .. ఆమె మంచి ఆర్టిస్ అవుతుందని చెప్పడానికి.సాధారణంగా మలయాళ సినిమాలలో ఇలాంటి ఒక నటనను మనం చూస్తూ ఉంటాము. హీరోయిన్ గా తొలి సినిమాలోనే అలాంటి నటనను ప్రదర్శించడం తన టాలెంటుకు నిదర్శనం. కథ .. స్క్రీన్ ప్లే .. సంగీతం పరంగా 'కోర్ట్' మెప్పించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. శివాజీ .. ప్రియదర్శి .. తరువాత ఎక్కువ మార్కులు శ్రీదేవికే దక్కుతాయి. తనే ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ. కాకినాడ అమ్మాయి ఇంత గొప్పగా చేసిందా అని చెప్పుకుంటున్నారు. అంజలి .. స్వాతి .. ఆనంది వంటి తెలుగు హీరోయిన్స్ తరువాత, ఆ స్థాయిలో శ్రీదేవి జెండా ఎగరేస్తుందేమో చూడాలి.
Latest News