by Suryaa Desk | Fri, Nov 22, 2024, 03:22 PM
పౌరసరఫరాల శాఖ అధికారులు వరిధాన్యం అలాట్మెంట్లలో డిఫాల్టర్లకే పెద్దపీట వేశారు.రైస్ మిల్లుల అలాట్మెంట్ లలో పౌరసరఫరాల శాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది.ప్రభుత్వానికి కోట్లాది రూపాయల బకాయి పడిన డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు తిరిగి ఈ ఖరీఫ్ సీజన్ లో మళ్ళీ అలాట్మెంట్ లు ఇవ్వడం రైస్ మిల్లర్ల సంఘంలో కలకలం రేపుతోంది.అలాట్మెంట్ లలో అధికారులు,మిలర్లు మిలాకత్ అవడంతో ప్రభుత్వానికి భారీ మొత్తంలో నష్టం జరిగే ప్రమాదం ఉంది.కస్టం మిల్లింగ్ రైస్(సిఎంఆర్)లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం జిఓ.27 తీసుకువచ్చినా ప్రయోజనం లేకుండాపోయింది.పౌరసరఫరాల శాఖ అధికారులే జిఓ. 27 ను తుంగలో తొక్కుతున్నారన్న ఆరోపణలున్నాయి.మానకొండూర్ శివారులో ఉన్న రెండు రైస్ మిల్లుల యజమాని గతంలో ప్రభుత్వం నుంచి వరి ధాన్యం తీసుకుని ప్రభుత్వానికి సిఎంఆర్ పెట్టకుండా బయట విక్రయించుకుని సొమ్ము చేసుకొని ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు బకాయిపడ్డాడు.ప్రభుత్వానికి బకాయిపడ్డ డబ్బు ఏళ్ల తరబడి ప్రభుత్వానికి కట్టడం లేదు.ఆ రైస్ మిల్లర్ ను అధికారులు డిఫాల్టర్ గా గుర్తించారు.ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా బయట అమ్ముకున్నాడు.గతంలో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు అతనికి చెందిన రైస్ మిల్లుల్లో ధాన్యం తనిఖీలు చేయగా,విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
అధికారులు ధాన్యం నిల్వల్లో భారీగా తేడాలు గుర్తించారు.అయినా అతని రైస్ మిల్లులపై గాని,అతనిపై గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఫిజికల్ వెరిఫికేషన్ కు వచ్చిన అధికారులను మేనేజ్ చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.కాగా ఇటీవల కూడా అధికారులు అతని మిల్లుల్లో ధాన్యం తనిఖీలు చేయగా భారీగా వ్యత్యాసం కనబడటంతో అతనికి నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలియవచ్చింది.డిఫాల్టర్ గా ఉన్న అదే రైస్ మిల్లర్ కు సంబంధించిన రైస్ మిల్లులకు ఈ ఖరీఫ్ సీజన్ లో వేలాది క్వింటాళ్ల ధాన్యం దిగుమతి జరుగుతోంది.మానకొండూర్లో ఉన్న రెండు రైస్ మిల్లులు,తిమ్మాపూర్ మండలం రేణికుంట,కరీంనగర్ కోతిరాంపూర్లోని రైస్ మిల్లుల్లో వేలాది క్వింటాళ్ల వరిధాన్యం దిగుమతి అవుతోంది.అతనికి సంబంధించిన మరి కొన్ని బాగస్వామ్య రైస్ మిల్లుల్లో కూడా భారీ ఎత్తున ధాన్యం దిగుమతి జరుగుతోంది.అతడు బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వకున్నా,అండర్ టేకింగ్ లు ఇవ్వకున్నప్పటికీ పౌరసరఫరాల శాఖ అధికారులు అతని మిల్లులను ట్యాగింగ్ చేయడంలో ఆంతర్యం ఏమిటనే చర్చ సాగుతోంది.డిఫాల్టర్ అయిన సదరు రైస్ మిల్లర్ పౌరసరఫరాల శాఖ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని లక్షలాది రూపాయల డబ్బులు ఎర చూపి అక్రమంగా అలాట్మెంట్ లు పొందినట్లు ఆరోపణలున్నాయి.జిల్లాలో కొందరు రా రైస్ మిల్లర్లు,మరి కొందరు బాయిల్డ్ రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఎలాంటి బాకీ లేకున్నప్పటికీ వారికి ఈ సీజన్ లో అధికారులు అలాట్మెంట్ లు ఇవ్వలేదు.ఎందుకంటే అలాట్మెంట్ కోసం మామూలు ఇవ్వని మిల్లులకు అలాట్మెంట్ ఇవ్వడం లేదు.ప్రభుత్వానికి ఎలాంటి బాకీ లేని మిల్లర్లు అలాట్మెంట్ల గురించి ప్రశ్నిస్తే జిఓ.27 నిబంధనల ప్రకారం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని,అండర్ టేకింగ్ ఇవ్వాలని,25 శాతం ఫెనాల్టీ కట్టాలని నిబంధనలు గుర్తు చేస్తున్నారట.డిఫాల్టర్లకు లేని నిబంధనలు మాకే ఎందుకని అలాట్మెంట్లలో అన్యాయం జరిగిన కొందరు చిన్న మిల్లర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.