by Suryaa Desk | Fri, Nov 22, 2024, 03:33 PM
అంతర్జాతీయంగా మళ్లీ అదానీ వ్యవహారం బయటపడిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇది వెలుగు చూసిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘మా పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అదానీ తెలంగాణకు రాలేదు. కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియకుండా రేవంత్‌రెడ్డి ఆయనకు రెడ్‌కార్పెట్ పరిచారా? రూ.12,400 కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. విద్యుత్‌కు సంబంధించి ప్రాజెక్టులు అదానీకి అప్పగిచేందుకు సీఎం ప్రయత్నించారు. స్కిల్ యూనివర్సిటీకి ఆయన రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు. వ్యాపారవేత్తలు రూ.40వేల కోట్ల విరాళాలు ఉచితంగా ఇవ్వరని రాహుల్‌గాంధీ అన్నారు. జాతీయ పార్టీకి ఓ జాతీయ విధానం ఉండాలి. అదానీతో చేసుకున్న ఒప్పందాలను కెన్యా రద్దు చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవడం లేదు?రాహుల్‌గాంధీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయించాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.