by Suryaa Desk | Fri, Nov 22, 2024, 04:04 PM
వికారాబాద్ నియోజకవర్గం దారూర్ మండల కేంద్రంలో గురువారం జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కార్యక్రమాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ .
● పీ ఏ సీ ఎస్ ధారూర్ ఆద్వర్యంలో నూతనంగా నిర్మించిన రైస్ మిల్లు, మరియు 1500 మెట్రిక్ టన్నుల గోదాములను ప్రారంభించిన స్పీకర్ 56 కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ.
వ్యవసాయ మార్కెట్ కమిటీ, ధారూర్ ఆద్వర్యంలో మార్కెట్ యార్డులో మరియు నాగసమందర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
◆ కార్యక్రమాలలో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు.
ఈసందర్భంగా జరిగిన రైతుల సభలో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.
ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, మిగిలిన సమయంలో అందరం కలిసి ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి. వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాను. వికారాబాద్ జిల్లాలో నూతన పరిశ్రమలను స్థాపించి యువతకు ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తాను. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయి. టూరిజం ప్రమోషన్ ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాను.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మెజారిటీ అమలవుతున్నాయి. నేను స్పీకర్ హోదాలో ఉన్నప్పటికి ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలి.
గత ప్రభుత్వ తొమ్మిదిన్నర ఏళ్ళ పాలనలో రాష్ట్రం అప్పుల పాలయింది. నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు వడ్డీ, వాయిదాలకే పోతుంది. లేకపోతే అన్ని హామీలను అమలు చేసేవారు. అర్హులైన రైతులందరికీ రైతు రుణమాఫీ అందుతుంది, రైతులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. త్వరలోనే మహిళలకు నెలకు 2500 రూపాయల సహాయం కూడా అందుతుంది. ప్రజలకు మంచి పనులు చేయడానికి అవసరమైన బలం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందించాలని మనం రోజు భగవంతుని ప్రార్ధించాలి, వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని అందరం కోరుకోవాలి.
ఈ ఏడాది మంచిగా వర్షాలు కురిసాయి, బోర్లు, బావులలో నీళ్ళు బాగున్నాయి, వరి సాగు బాగా పెరిగింది, దిగుబడి కూడా మంచిగా వచ్చింది. అకాల వర్షాలు, తుఫానులు లేకపోవడంతో పంట కోతలు సాఫీగా జరుగుతున్నాయి. ఈ ఏడాది సన్నాలకు మంచి డిమాండ్ ఉన్నది. ప్రవేటు మిల్లర్లు పోటీ పడి కొంటున్నారు. రైతులకు నా విజ్ఞప్తి, మీకు మంచి రేటు ఎక్కడ ఉంటే అక్కడ అమ్ముకోండి, తక్కువ ధరకు అమ్ముకోవద్దు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2300 రూపాయల మద్ధతు ధర వస్తుంది. తేమ 8 శాతం లోపల ఉండాలి, రైతులకు నా విజ్ఞప్తి, మంచిగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురండి, తాలు, మట్టి లేకుండా శుభ్రంగా తీసుకురండి, ఇబ్బందులు లేకుండా వెంటనే కొనుగోలు చేస్తారు.
ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి వారం పది రోజుల్లో రైతుల బ్యాంకు అకౌంట్లలోకి డబ్బులు వేస్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజా ప్రభుత్వం క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తుంది, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్ముకునే రైతులందరికీ బోనస్ వస్తుంది. కొంతమంది అనవసరంగా రాద్దాంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సరికాదు, బోనస్ ఇచ్చి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. దిగుబడి బాగుంది, రేట్ మంచిగా ఉన్నది, రైతులు సంతోషంగా ఉన్నారు, మాకు అది చాలు. కరంటు మంచిగా వస్తున్నది, విత్తనాలు, ఎరువులకు కొరత లేదు. రైతులు బాగుపడినా కొంతమందికి బాధ ఉంటుంది, ఏడిచేటోళ్ళు ఏడుస్తానే ఉంటారు, వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైతులు బాగుండాలన్నదే మా లక్ష్యం, ఇది రైతుల మేలు కోరే ప్రభుత్వం, రైతులకు అండగా ఉంటున్న ప్రభుత్వం.మా ప్రజాప్రతినిధులకు, అధికారులకు నా సూచన మీరు స్థానికంగా అందుబాటులో ఉంటూ కొనుగోళ్ళు సాఫీగా జరిగేటట్లు చూడండి, ఏది ఏమైనా రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదీ.