by Suryaa Desk | Fri, Nov 22, 2024, 07:07 PM
కొన్ని ఘటనలు చూస్తే భయపడతాం.. మరికొన్నింటిని చూస్తే జాగ్రత్తపడతాం.. ఇంకొన్నింటితో ఉద్వేగానికి లోనవుతుంటాం. కానీ ఈ ఘటన చూస్తే ఊరే ఉలిక్కిపడింది. ఏం కీడు జరగనుందోనని గ్రామస్థులు భయపడుతున్నారు. అసలు అది మానవ తప్పిదమా.. ప్రకృతి పంపిన సంకేతామా.. అని జనాలు ఆలోచిస్తున్నారు. అసలు ఆ ఘటన దేనికి సంకేతమని బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు. ఇంతలా ఏం జరిగిందీ అంటే.. ఏకంగా దేవుడికి మంటలంటుకున్నాయి. విగ్రహం మొత్తాన్ని అగ్ని దేవుడు ఆవహించాడు. ఉగ్రరూపంతో అగ్ని జ్వాలలు ఎగిసిపడుతుండటం చూసి జనాలు హతాశులయ్యారు. భయంతో వణికిపోయారు. ఈ అపశ్రుతి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అంబటిపల్లిలోని శ్రీ అమరేశ్వరాలయంలో జరిగింది.
అమరేశ్వర ఆలయానికి నిత్యం భక్తులు వస్తుంటారు. రోజూ ఆ అమరేశ్వరునికి ప్రత్యేక పూజలతో దీపారాధన జరుగుతూనే ఉంటుంది. అయితే.. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి.. పూజలు నిర్వహిస్తున్నారు. కాగా.. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఏమైనా కోరుకుంటే.. ఆ కోరికలు కచ్చితంగా నెరవేరుతాయన్నది అక్కడి భక్తుల విశ్వాసం. దీంతో.. ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇంత విశిష్టత కలిగిన అమరేశ్వర ఆలయంలో ఘోర అపశ్రుతి చోటుచేసుకుంది.
గురువారం (నవంబర్ 22న) రాత్రి హనుమాన్ ఆలయం నుంచి పెద్ద ఎత్తున పొగలు వస్తుండటాన్ని స్థానికులు గమనించారు. ఏం జరుగుతుందోనని ఆలయం లోపలికి వెళ్లి చూసేసరికి.. హనుమంతుడి విగ్రహం మొత్తం వ్యాపించిన ఆగ్నికీలలు అంతెత్తున ఎగిసి పడుతుండటాన్ని చూసి.. స్థానికులు మొదట భయపడ్డారు. లోకమంతటికీ వెలుగును పంచే అతిపెద్ద అగ్నిగోళమైన సూర్యున్ని పండు అనుకొని మింగేసిన హనుమంతున్ని అగ్ని దేవుడు ఆవహించటాన్ని చూసి.. జనాలు హతాశులయ్యారు. ఆనాడు తన తోకకు నిప్పంటిస్తే మొత్తం లంకనే తగలబెట్టేసిన ఆంజనేయుడి విగ్రహానికి మంటలంటుకోవటం ఆందరినీ షాక్‌కు గురిచేసింది. ఆ షాక్ నుంచి వెంటనే తేరుకుని.. నీళ్లతో ఆ మంటలను ఆర్పేశారు.
అసలు ఈ ఘటన ఎలా జరిగింది.. దీనికి గల కారణాలేంటీ అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా దుండగులు ఆలయంలోకి ప్రవేశించి.. ఈ ఘటనకు పాల్పడ్డారా.. లేదా అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హనుమంతుడి విగ్రహం దగ్గర నిత్యం గరుడ దీపం వెలుగుతూనే ఉంటుంది. అయితే.. నూనె ఏమైనా కారటం వల్ల మంట చెలరేగటమో.. లేదా అగర్‌బత్తీల లాంటి వాటి నుంచి నిప్పురవ్వలు పడటమో.. గాలికి ఏదైనా కొట్టుకొచ్చి అంటుకోవటమో జరిగి ఉంటుందని.. ఆ మంట కాస్త విగ్రహానికి అంటుకుని ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే.. ఎలాగూ హనుమంతుడికి నిత్యం చందనాభిషేకం ఎలాగూ చేస్తుంటారు కాబట్టి.. చందనం, నూనె మిశ్రమాన్నే విగ్రహానికి పట్టిస్తుండటం వల్ల మంటలు అంటుకోగానే ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడి పూర్తిగా వ్యాపించి ఉంటాయన్న రకరకాల చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులకు గ్రామస్థులు ఫిర్యాదు చేయటంతో.. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మహిమ గల ఆలయంలో హనుమంతుడి విగ్రహం మొత్తానికి మంటలు అంటుకోవటం తీవ్ర అపశ్రుతిగా గ్రామస్థులు భావిస్తున్నారు. అసలు ఈ ఘటన దేనికి సంకేతమని ఆందోళనకు గురవుతున్నారు. పండితులను పిలిపించి.. ఈ ఘటనతో గ్రామానికి ఎలాంటి కీడు జరిగే అవకాశాలున్నాయని ఆరా తీస్తున్నారు. దేవుడే మంటలంటుకున్నాయంటే.. అందులో కచ్చితంగా మానవ తప్పిదం ఉండే ఉంటుందని.. దానికి దేవుడు ఎలాంటి శిక్షలు వేస్తారంటూ చర్చించుకుంటున్నారు. ఈ ఘటనకు.. ఎలాంటి శాంతి పూజలు చేయాలని గ్రామస్థులు తెలుసుకుంటున్నారు.