by Suryaa Desk | Fri, Nov 22, 2024, 07:11 PM
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదవటం ఇప్పుడు దేశంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో.. గౌతమ్ అదానీతో రేవంత్ రెడ్డి సర్కార్ చేసుకున్న వ్యాపార ఒప్పందాలు, తెలంగాణలో అదానీ పెట్టుబడులు, ఇచ్చిన విరాళాల గురించి కూడా తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అదానీ పెట్టుబడులు, సర్కారుతో వ్యాపాల ఒప్పందాలపై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.
చట్టానికి లోబడే వ్యాపారాలను తెలంగాణలో అనుమతి ఇస్తామని.. అది అదానీ అయినా అంబానీ అయినా సరే అంటూ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే.. అదానీపై వస్తున్న అవినీతి ఆరోపణలు నిజమేనని నిరూపితమైతే.. తెలంగాణలో ఆయన పెట్టుబడులపై పునరాలోచన చేస్తామని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం (నవంబర్ 22న) రోజున గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్.. అదానీకి ఇప్పటి వరకు ఇంచు భూమి ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే క్రమంలో.. స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం ఇచ్చారని స్పష్టం చేశారు. అయితే.. ఆ విరాళం రేవంత్ రెడ్డి సొంత పాకెట్‌కు ఇవ్వలేదని.. ప్రజా అవసరాలకు ఇచ్చిన విరాళమని వివరించారు.
రేపు కేటీఆర్ వచ్చి విరాళం ఇస్తామంటే కూడా స్వీకరిస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గతంలోనూ తెలంగాణలో అదానీ కార్యకలాపాలు సాగాయన్న మహేష్ కుమార్ గౌడ్.. అప్పుడు అదానీ డబ్బులు కొందరికి వ్యక్తిగతంగా ముట్టాయని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. చట్టరీత్యా వ్యాపారాలు చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని.. ఇప్పుడు బయటకు వచ్చిన అంశంపై జేపీసీ కోరుతున్నామని చెప్పుకొచ్చారు. జేపీసీ ఏర్పాటై నిష్పక్షపాతంగా విచారణ జరిగితే నరేంద్ర మోదీ ప్రధానిగా తప్పుకోవాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదానీ అవినీతిపై రాహుల్ గాంధీ ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ స్పందించలేదని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అర్హత లేకపోయినా అదానీకి వేల కోట్ల రుణాలు ఇచ్చారని ఆరోపించారు. దేశంలో దొపిడీ జరుగుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ కళ్లు మూసుకున్నారా అంటూ నిలదీశారు. తక్షణమే అదానీని అరెస్టు చేయాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంలో సెబీ పూర్తిగా విఫలమైందన్న మహేష్ కుమార్ గౌడ్.. సెబీ ఛైర్మన్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో చేరికలపై కూడా మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని.. ఎంతమంది చేరుతారో త్వరలోనే క్లారిటీ ఇస్తామని మహేష్ కుమార్ పేర్కొన్నారు. కేటీఆర్‌కు అత్యంత దగ్గరగా ఉండేవారు కూడా తమతో టచ్‌లో ఉన్నారంటూ మహేష్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరింత ఆసక్తికర చర్చ నడుస్తోంది.