|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 01:11 PM
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో సంచలనం సృష్టించిన న్యాయవాది స్వప్న హత్య కేసులో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా చూసుకున్న కూతురు, తోడబుట్టిన అన్న చేతిలోనే దారుణ హత్యకు గురైందన్న వార్తను జీర్ణించుకోలేక ఆమె తల్లి మల్లమ్మ (70) గురువారం తుదిశ్వాస విడిచారు. ఒకే కుటుంబంలో చోటుచేసుకున్న ఈ రెండు మరణాలతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. పదేళ్ల క్రితం తండ్రి శాంతయ్య చనిపోయాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. న్యాయవాది అయిన స్వప్న తన ఇద్దరు తల్లులు వెంకటమ్మ, మల్లమ్మల బాగోగులను చూసుకుంటున్నారు. అయితే, ఆస్తిపై కన్నేసిన స్వప్న సోదరుడు రాజు.. మరో ముగ్గురితో కలిసి ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. అండగా ఉన్న కూతురు హత్యకు గురవడం, కన్న కొడుకే హంతకుడిగా మారడంతో మల్లమ్మ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. మరో తల్లి వెంకటమ్మ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం, ప్రధాన నిందితుడైన రాజుతో పాటు అతనికి సహకరించిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించింది. ఆస్తి పత్రాల కోసం జరిగిన ఈ ఘాతుకంలో ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు.