![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 01:48 PM
మంచు కుటుంబంలో రేగిన వివాదాలు సద్దుమణిగాయని భావిస్తున్న తరుణంలో మనోజ్ మరో సంచలన ప్రకటన చేశారు. అన్న డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’కు పోటీగా తన సినిమాను విడుదల చేస్తానని ప్రకటించారు. దీంతో మంచు ఫ్యామిలీ గొడవ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మంచు మనోజ్, మోహన్ బాబు- విష్ణుల మధ్య వివాదం రేగడం, బౌన్సర్లతో ఫాంహౌస్ ముందు మనోజ్ హంగామా సృష్టించడం తెలిసిందే. ఈ వ్యవహారంలో మనోజ్ తో పాటు విష్ణు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ గొడవను కవర్ చేయడానికి వెళ్లిన ఓ విలేకరిపై మోహన్ బాబు దాడి చేయడం, ఆ తర్వాత జర్నలిస్టులకు క్షమాపణ చెప్పడం తెలిసిందే.కొంతకాలంగా అన్నదమ్ములు మౌనంగా ఉండడంతో గొడవ సమసిపోయిందని అంతా అనుకున్నారు. ఇటీవల మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మనోజ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరితమైన పోస్టు పెట్టడంతో మంచు కుటుంబం కలిసిపోతుందని అభిమానులు ఆశించారు. అయితే, మంచు కుటుంబ వివాదానికి సంబంధించిన వేడి ఇప్పుడు వెండితెరకు తాకింది. అన్నదమ్ములు పోటీగా సినిమాలు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంచు విష్ణు తన డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. మంచు మనోజ్ కూడా తన తాజా సినిమా ‘భైరవం’ను అదే సమయంలో విడుదల చేస్తానని తాజాగా ప్రకటించారు. వెండితెరపైనే తేల్చుకుందామని అన్నకు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం మంచు మనోజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News