by Suryaa Desk | Thu, Nov 07, 2024, 04:48 PM
2024-25 సీజన్ కు సంబంధించిన వరి కొనుగోలుపై బుధవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వరిని కొనుగోలు చేసేందుకు వీలుగా 126 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రైతులు పండించిన ధాన్యం గ్రేడ్- ఏ రకానికి 2320 రూపాయలు, సాధారణ రకానికి 2300 రూపాయలు అదే విధంగా సన్న రకం ధాన్యానికి అదనంగా 500 రూపాయలు చెల్లించుటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. 126 వరి కొనుగోలు కేంద్రాలకు గాను 34 ఐకెపి, 61 పిఎసిఎస్, 31 డీసీఎంఎస్ ఏజెన్సీల ద్వారా 108 కేంద్రాల్లో దొడ్డు రకం వరి ధాన్యం, 18 కేంద్రాల్లో సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు నిర్ణయించడం జరిగిందని ఆయన తెలిపారు. రైతులు ఆరబెట్టిన, చెత్త, తేమ లేకుండా ధాన్యము కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చే విధంగా రైతులకు సూచించాలని ఆయన తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలతో పాటు గోనె సంచులను అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. కేంద్రాల్లో రైతులందరూ రైస్ మిల్లర్లతో అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో ఉంటూ వరి కొనుగోలును వేగవంతం చేస్తూ, ఎప్పటికప్పుడు ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు చేరే విధంగా వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, డి ఆర్ డి ఓ శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, జిల్లా మేనేజర్ విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి లు పాల్గొన్నారు.