by Suryaa Desk | Fri, Nov 08, 2024, 02:31 PM
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెంచుపల్లి గ్రామంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో సర్వే నిమిత్తం అధికారులు సందర్శించినప్పుడు తమ పూర్తి సమాచారాన్ని అందించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఇంటి యజమాని ఇచ్చిన వివరాలను మాత్రమే ప్రొఫార్మాలో పొందుపరచాలని ఆయన సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకొని ఇచ్చిన ఫారాల్లో సమాచారాన్ని క్రోడీకరించాలని ఆయన సూచించారు.
చెంచుపల్లిలోని భూముల సమస్యలను క్షుణ్ణంగా అవగాహన కల్పించుకొని పరిష్కార దిశగా కృషి చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాసు పుస్తకాల సమస్యలు, ఇతర ఎలాంటి భూమి సమస్యలు ఉన్న రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకుపోవాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. గ్రామంలో విద్యుత్తు తీగలు పూర్తిగా కిందికి వేలాడుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన కలెక్టర్ విద్యుత్తు తీగలను సరిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ పర్యటనలో భాగంగా అంగన్వాడి పూర్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి సామ్, మామ్ పిల్లల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆల్ఫాబెట్స్, నంబరింగ్ గురించి పిల్లలను అడిగి కలెక్టర్ చదివించారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను అందజేశారు. ఆకస్మిక తనిఖీలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, తహసిల్దార్ భరత్, ఎంపీడీవో పాండు, అంగన్వాడీ టీచర్ విజయ కుమారి లు ఉన్నారు.