by Suryaa Desk | Fri, Nov 08, 2024, 03:08 PM
ఆయిల్ పామ్ సాగు లో సరైన మెలకువలు పాటించి లబ్ధి పొందాలని మండల వ్యవసాయ అధికారి వసంతరావు మరియు హార్టికల్చర్ ఆఫీసర్ సౌమ్య ఆన్నారు. గురువారం జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామపంచాయతీలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి వసంతరావు మాట్లాడుతూ వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే ఆయిల్ ఫామ్ సాగు ఒక్కటే పరిష్కారం అని, ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతుకు బంగారు భవిష్యత్తు ఎందుకనగా ఆయిల్ పామ్ 30 సంవత్సరాల దీర్ఘ కాలిక పంటని నాలుగో సంవత్సరం దిగుబడి మొదలై 30 సంవత్సరాలు వరకు ప్రతినెల రెండు కోత లతో సంవత్సరం పొడుగునా దిగుబడులతో రైతు అధిక ఆదాయాన్ని పొందవచ్చని తెలియజేశారు. ఆయిల్ పామ్ సాగులో ఖర్చు చాలా తక్కువని, కూలీల అవసరం చాలా వరకు తగ్గుతుందని, ఒక వ్యక్తి 10 ఎకరాల ఆయిల్ పాం తోటను సులువుగా పరివేక్షించవచ్చుని తెలిపారు. ఆయిల్ ఫాం సాగు వల్ల నిరంతర దిగుబడి ఆదాయంతో రైతుల ఆర్థిక పురోగతి అత్యున్నత దశకు చేరుకొని రైతు మాత్రమే కాకుండా రైతుల భావితరాలు కూడా ఆయిల్ ఫామ్ తో లబ్ధి పొందే అవకాశం ఉందని అన్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ సౌమ్య మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగులో చీడపీడలు మరియు కోతుల బెడద చాలా తక్కువ అని తుఫానులు గాలి వానలు వడగండ్ల వల్ల పంటకు ఎలాంటి నష్టం వాటిల్లదని రైతులకు సెక్యూరిటీ కలిగిన ఒకే ఒక పంట ఆయిల్ ఫామ్ అని అన్నారు. ఎకరానికి 57 ఆయిల్ పామ్ మొక్కలు 9x9x9 మీటర్లు త్రిభుజాకార పద్ధతిలో నాటుకుంటే సరిపోతుందని, మొదటి నాలుగు సంవత్సరాలు అంతర పంటలు పండించుకోవచ్చని దీనికి ప్రభుత్వం నుండి సంవత్సరానికి ఎకరానికి 4200/ రూపాయలు 4 సంవత్సరాలు వరకు వస్తాయని తెలియజేశారు.
4 సంవత్సరం నుండి ఆయిల్ పామ్ దిగుబడి ప్రారంభమవుతుందని ఎకరాకు సంవత్సరం మొత్తం మీద పది నుండి 12 టన్నుల వరకు గెలల దిగుబడి వస్తుందని, ఎకరానికి ఖర్చు సంవత్సరానికి 25 వేలకు మించుదని, సంవత్సరానికి ఖర్చులు పోను నికరంగా ఎకరానికి కనీసం 1లక్ష రూపాయల మిగులుతుందని తెలిపారు. ఆయిల్ పామ్ పండించే రైతులకు కేవలం 20 రూపాయలకే (90% సబ్సిడీ పై) మొక్కలు అందించడం జరుగుతుందని అలాగే డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కూడా 80 నుండి 90% సబ్సిడీ మీద అందించడం జరుగుతుందని కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆయిల్ పామ్ తోటను పరిశీలించి రైతుకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ విజయ్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి కృష్ణమూర్తి మరియు రైతులు పాల్గొన్నారు.