|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 09:04 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినీ పరిశ్రమలో అడుగుపెట్టి విజయవంతంగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్నారు. కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ'తో వెండితెరకు పరిచయమైన ఈ భామ.. అనతి కాలంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఈ తొమ్మిదేళ్ల మైలురాయిని పురస్కరించుకుని అభిమానులు ఆమెపై కురిపిస్తున్న ప్రేమకు ఫిదా అయిన రష్మిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.తొమ్మిదేళ్లు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పటివరకు 26 సినిమాల్లో నటించాను. అయితే నా సినిమాల కంటే ఈ ప్రయాణంలో నేను సంపాదించుకున్న నా 'ఫ్యామిలీ' ని చూసి ఎక్కువగా గర్వపడుతున్నాను. మీ ప్రేమ, నమ్మకం, ఓర్పు చిన్న చిన్న క్షణాలు, పెద్ద విజయాలు ఈ తొమ్మిదేళ్లలోని ప్రతి విషయం నా గుండెను నింపేశాయి. సంతోషం, గర్వం, కృతజ్ఞతతో నా మనసు నిండిపోయింది అని రష్మిక పేర్కొన్నారు.సోషల్ మీడియాలో అభిమానులు పెడుతున్న పోస్టులు, మెసేజ్‌లు, ట్వీట్లు చదువుతుంటే తనకెంతో ఆనందంగా ఉందని రష్మిక తెలిపారు.మీ మెసేజ్‌లు నా మోముపై చిరునవ్వును తెప్పించాయి. ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా అనిపిస్తోంది. నా ప్రతి గెలుపులో, ఓటమిలో, సందేహాల్లో ప్రతి దశలోనూ నాకు తోడుగా నిలిచినందుకు ధన్యవాదాలు అని రాసుకొచ్చారు.అసలు ఈ తొమ్మిదేళ్లు ఇండస్ట్రీలో ఎలా నెట్టుకురాగలిగానో తనకే తెలియదని, కేవలం అభిమానుల వల్లే ఇది సాధ్యమైందని 'పుష్ప' నటి చెప్పుకొచ్చారు. తాను ఎలా ఉన్నానో అలా అంగీకరించి, ఇంత గొప్పగా ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మన మధ్య ఉన్న బంధం నటి-ప్రేక్షకుడు అనే స్థాయిని దాటి ఎప్పుడో కుటుంబ బంధంగా మారిపోయింది. అది నాకు ఎంతో విలువైనది. మిమ్మల్ని ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటాను అని రష్మిక ఎమోషనల్ అయ్యారు. భవిష్యత్తులోనూ మరింత కష్టపడి, మంచి సినిమాలు చేసి అభిమానులు గర్వపడేలా చేస్తానని రష్మిక మాటిచ్చారు. ఎల్లప్పుడూ మీ ప్రేమ, మద్దతు తనకు కావాలని కోరుతూఎప్పటికీ మీ రష్మిక అంటూ తన నోట్‌ను ముగించారు.
Latest News