![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 06:33 AM
'డీజే టిల్లు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని, 'బలగం' సినిమాతో మరింత పాప్యులర్ అయిన నటుడు మురళీధర్ గౌడ్. ఇటీవల వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో ఆయన చేసిన వెంకటేశ్ మామ పాత్ర జనంలోకి బాగా వెళ్లింది. తాజాగా 'బిగ్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను జాబ్ చేస్తున్నప్పుడు అడపాదడపా టీవీ సీరియల్స్ లో చిన్నచిన్న వేషాలు వేశాను. రిటైర్ మెంట్ తరువాత పెద్ద పెద్ద రోల్స్ వస్తాయని అనుకున్నాను. కానీ అది అంత తేలికైన విషయం కాదని ఆ తరువాత అర్థమైంది. 'డీజే టిల్లు'కు ముందు వరకూ ఫొటోలు పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని. ఏ పని ఇచ్చినా ఆ పనిపైనే పూర్తి ఫోకస్ పెట్టేవాడిని. అదే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది" అని అన్నారు. "మాది చాలా పేద కుటుంబం... ఐదుగురం సంతానం... మా నాన్న ఒక్కడి కష్టంపై బ్రతికేవాళ్లం. అప్పు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎవరి దగ్గరా ఒక్క రూపాయి అడక్కుండానే ఇక్కడి వరకూ వచ్చాను. సాదా సీదాగా ఉండటానికే ఇష్టపడుతూ ఉంటాను. కానీ కోటీశ్వరుడిని కావాలనే ఒక పట్టుదల నాలో పెరుగుతూ వచ్చింది. అందుకు కారణం ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను అనుభవిస్తూ వచ్చిన పేదరికమే. ఆ కసితోనే కోటీశ్వరుడిని కావాలనుకుంటున్నాను" అని చెప్పారు.
Latest News