|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 06:05 PM
కమెడియన్ గా చాలా వేగంగా ఎదుగుతూ వచ్చిన వారిలో సప్తగిరి కూడా కనిపిస్తాడు. కమెడియన్ గా చేస్తూనే, హీరోగానూ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన ఎక్కువ సమయాన్ని తీసుకోలేదు. అలా ఆయన హీరోగా చేసిన సినిమానే 'పెళ్లికాని ప్రసాద్'. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది మార్చి 21న థియేటర్లకు వచ్చింది. నిన్నటి నుంచి ఈ సినిమా 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: అన్నపూర్ణ (అన్నపూర్ణమ్మ) స్నేహితురాలు సుగుణ, తన కూతురుకు ఫారిన్ సంబంధం చేసి, వాళ్లతో పాటు విదేశాలకు వెళ్లిపోతుంది. అయితే అప్పటికే అన్నపూర్ణ కూతురు లక్ష్మీకి వివాహమై పోవడం వలన, ఫారిన్ వెళ్లాలనే కోరిక నెరవేరకుండా పోతుంది. దాంతో అన్నపూర్ణ తన మనవరాలు కృష్ణప్రియ (ప్రియాంక శర్మ)కు ఫారిన్ సంబంధం చేయాలనీ, ఆమెతో పాటు కుటుంబమంతా విదేశాలకు వెళ్లిపోవాలని బలంగా నిర్ణయించుకుంటుంది. మిగతా వాళ్లంతా కూడా అదే ఆలోచనతో ఉంటారు. అదే ఊరుకు చెందిన ప్రసాద్ (సప్తగిరి) మలేషియాలో ఒక హోటల్లో మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన తండ్రి గోపాలరావు (మురళీధర్ గౌడ్)కి తన కొడుకు రెండు కోట్ల కట్నం తీసుకురావాలనే కోరిక ఉంటుంది. అలా చేయడం వల్లనే తన పూర్వీకుల పరువు ప్రతిష్ఠలు కాపాడినట్టు అవుతుందనేది అతని నమ్మకం. ఆ కారణంగా ప్రసాద్ కి సంబంధాలు కుదరకపోవడం .. అతని వయసు 40కి దగ్గర పడటం జరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే అందరూ అతనిని 'పెళ్లికాని ప్రసాద్' గా చెప్పకుంటూ ఉంటారు. ఫారిన్ వెళ్లాలనే ఆశ ఉన్న కృష్ణప్రియ, ప్రసాద్ ఆ ఊరికి వచ్చినప్పుడు లైన్లో పెడుతుంది. ఆ ఫ్యామిలీకి ఫారిన్ పిచ్చి ఉందని తెలియని ప్రసాద్, ఆమె గాలానికి చిక్కుతాడు. తాను ఫారిన్ లో జాబ్ మానేసిన విషయాన్ని చెప్పకుండా, పైసా కట్నం తీసుకోకుండా ఆమె మెడలో మూడుముళ్లు వేసేస్తాడు. పర్యవసానంగా ఏం జరుగుతుంది? అనేదే మిగతా కథ.
Latest News