by Suryaa Desk | Fri, Nov 08, 2024, 06:40 PM
నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా.. ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అభిమానాలు సంబురాలు చేసుకుంటున్నారు. రకరకాల కార్యక్రమాలు చేపడుతూ.. రేవంత్ రెడ్డిపై అభిమానం చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. సిరిసిల్లకు చెందిన ఓ నేతన్న రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అరుదైన కానుకను సిద్ధం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేత ప్రశంసలు అందుకున్న సిరిసిల్ల చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుత కళాఖండాన్ని తయారు చేశారు.
రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టు వస్త్రంపై తెలంగాణ ముఖచిత్రంలో చిరుమందహాసంతో ఉన్న రేవంత్ రెడ్డి ఫోటోను నేశాడు వెల్ది హరిప్రసాద్. సుమారు 5 రోజుల పాటు శ్రమించి ఈ అరుదైన కానుకను సిద్ధం చేసినట్టు వెల్ది హరిప్రసాద్ తెలిపారు. ఈ పట్టువస్త్రం పొడవు 32 ఇంచులు, వెడల్పు 47 ఇంచులు. కాగా.. కానుకను తయారు చేసేందుకు రూ.20 వేల వరకు ఖర్చు వచ్చిందని హరిప్రసాద్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ కానుకను సిద్ధం చేశానని.. అవకాశం కల్పిస్తే ఈ పట్టు వస్త్రాన్ని స్వయంగా వెళ్లి బహుకరిస్తానని హరిప్రసాద్ ఆకాంక్షిస్తున్నాడు.
"ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అరుదైన కానుకగా అందించాలని పట్టువస్త్రంపై ఆయన చిత్రం వచ్చేలా తయారు చేశా. సుమారు 5 రోజుల పాటు శ్రమించి ఈ పట్టువస్త్రాన్ని తయారు చేశా. సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం కల్పిస్తే.. ఈ అరుదైన కానుకను స్వయంగా అందజేస్తా." అంటూ నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ చెప్పుకొచ్చారు.
కాగా.. వెల్ది హరిప్రసాద్ చేనేత రంగంలో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించారు. గతంలో ఎన్నో కళాఖండాలను తయారు చేసి.. ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. జీ-20 సదస్సు లోగోను పట్టు వస్త్రంపై రూపొందించిన హరిప్రసాద్.. ప్రధాని మోదీ చేత ప్రశంసలు పొందారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ స్వయంగా.. హరిప్రసాద్ పేరును ప్రస్తావించడంతో ఆయన పేరు దేశమంతా వినిపించింది. 2022లోనూ.. అప్పటి సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్ ఫొటోలతో పాటు పలు పథకాల వివరాలను తెలుపుతూ పట్టు వస్త్రాన్ని నేసి అబ్బుర పరిచాడు హరి ప్రసాద్. 2021లోనూ అగ్గిపెట్టలో పట్టే పట్టు చీర.. దబ్బనంలో ఇమిడే పట్టు చీరలు రూపొందించి హరిప్రసాద్ అందరి దృష్టిని ఆకర్షించారు.