by Suryaa Desk | Fri, Nov 08, 2024, 07:08 PM
వరంగల్ వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరబోతోంది. వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ సర్కార్.. మామునూరు ఎయిర్ పోర్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే గురువారం (నవంబర్ 07న) రోజు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ.. జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి.. మామునూరు ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ నిమిత్తం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా.. గాడిపల్లి గుంటూరుపల్లి, నక్కలపల్లి గ్రామస్తులతో మంత్రి సమావేశమై విమానాశ్రయ ఏర్పాటుకు కావల్సిన 253 ఎకరాల భూసేకరణ నిమిత్తం రైతులతో మాట్లాడారు.
విమానాశ్రయం అందుబాటులోకి వస్తే స్థానిక ప్రజల జీవితాలు ఎలా మెరుగుపడతాయన్నది రైతులకు మంత్రి కొండా సురేఖ వివరించారు. విమానాశ్రయం ఏర్పాటుకు తమ విలువైన భూములు ఇస్తున్న రైతులకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తామని కొండా సురేఖ హామీ ఇచ్చారు. భూమి కోల్పోతున్న 233 మంది రైతులు, ప్లాట్ల యజమానులతో చర్చించి వారి అభిప్రాయాల మేరకు వేరే చోట భూమి కేటాయిస్తామని చెప్పుకొచ్చారు. రైతులు కోరిన విధంగా మౌలిక సదుపాయలైన రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, ఇతర సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తెలంగాణా సర్కార్ ఉందని తెలిపారు. వరంగల్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వరంగల్ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. వరంగల్ భవిష్యత్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మామునూరు ఎయిర్ పోర్ట్‌ను అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు.
ప్రయాణికుల సర్వీసులతో పాటు, కార్గో సర్వీసులు అందించే దిశగా ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ విమానాశ్రయానికి 150 కిలో మీటర్ల దూరంలో మరో వాణిజ్య విమానాశ్రయం ఏర్పాటు నిబంధనల మేరకు కుదరదని చెప్పినా.. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని, జీఎంఆర్ సంస్థను ఒప్పించి మామునూరు ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారని మంత్రి పేర్కొన్నారు. వీలైనంత త్వరలోనే మామునూరు ఎయిర్ పోర్టు పనులును మొదలు పెడతామని కొండా సురేఖ చెప్పుకొచ్చారు.