![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 10:41 AM
నటసింహ నందమూరి బాలకృష్ణ యాభై ఏళ్ళ నటజీవితంలో అనేక రికార్డులు సాధించారు. ఆ రికార్డులు ఆయన కీర్తి కిరీటంలో రత్నాలుగా వెలుగొందుతున్నాయి. బాలయ్యతో వర్క్ చేసిన టెక్నీషియన్స్ కూడా ఆయనతో కలసి కొన్ని రికార్డులు క్రియేట్ చేయడం విశేషం! బాలకృష్ణ కెరీర్ లో ఆయనకు వరుసగా మూడు హిట్స్ తో హ్యాట్రిక్ అందించిన దర్శకులు ముగ్గురున్నారు. వారు కోడి రామకృష్ణ , బి.గోపాల్, బోయపాటి శ్రీను అని బాలయ్య ఫ్యాన్స్ ఇట్టే చెప్పేస్తారు. ఇలా ముగ్గురు దర్శకులతో హ్యాట్రిక్స్ చూస్తూ సాగిన స్టార్ తెలుగునాట లేరనే చెప్పాలి. అందరికన్నా బాలయ్యకు ముందు హ్యాట్రిక్ అందించిన దర్శకునిగా కోడి రామకృష్ణ నిలిచారు. బాలయ్య కెరీర్ లోనే తొలి బిగ్ హిట్ గా నిలచిన 'మంగమ్మగారి మనవడు' కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే తెరకెక్కింది. ఈ సినిమా హైదరాబాద్ లో 560 రోజులు మూడు ఆటలతో ప్రదర్శితమై ఈ నాటికీ ఓ రికార్డుగా నిలచే ఉంది. ఓ తెలుగు చిత్రం హైదరాబాద్ లో రోజూ మూడు ఆటలతో గ్యాప్ లేకుండా 560 రోజులు చూడడం అన్నది ఒక్క బాలకృష్ణ 'మంగమ్మగారి మనవడు' పేరిటే ఉంది. ఆ తరువాత 'మంగమ్మగారి మనవడు' తీసిన భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే బాలయ్యతో 'ముద్దుల క్రిష్ణయ్య, మువ్వగోపాలుడు ' వంటి హిట్స్ ను రూపొందించారు కోడి రామకృష్ణ. ఈ మూడు సినిమాలు ఒక్కోటి 300 రోజులు ప్రదర్శితం కావడం విశేషం! ఈ రికార్డ్ ఇప్పటి దాకా తెలుగునాట ఏ హీరోకు లేకపోవడం గమనార్హం! ఆ తరువాత బాలయ్యతో కోడి రామకృష్ణ "భారతంలో బాలచంద్రుడు, ముద్దుల మావయ్య, బాలగోపాలుడు, ముద్దుల మేనల్లుడు" వంటి చిత్రాలు రూపొందించారు. వీటిలో 'ముద్దుల మావయ్య' కూడా బంపర్ హిట్ గా నిలచింది. ఈ సినిమా కూడా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుండే రావడం విశేషం! 'ముద్దుల మావయ్య' కూడా గోల్డెన్ జూబ్లీ చూసింది. ఒక బ్యానర్ లో ఒకే హీరోతో ఓ డైరెక్టర్ మూడు గోల్డెన్ జూబ్లీస్ చూడడమన్న అరుదైన రికార్డును కోడి రామకృష్ణ సొంతం చేసుకున్నారు. అది బాలయ్యతోనే కోడికి సాధ్యమైందన్న విషయాన్ని మరువరాదు.
Latest News