|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 12:39 PM
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా కూడా విధించింది. ఉన్నత స్థాయి అధికారికి ఇలాంటి శిక్ష పడటం రాష్ట్రవ్యాప్తంగా అధికార వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది.కేసు వివరాల్లోకి వెళితే... భూహక్కులకు సంబంధించి ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు, వివాదంలోని ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో, న్యాయస్థానం విధించిన గడువు ముగిసినా కలెక్టర్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మహిళ మళ్లీ కోర్టును ఆశ్రయించి, కలెక్టర్ తన సమస్యను పట్టించుకోకపోవడమే కాకుండా కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా బేఖాతరు చేశారని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.విచారణ చేపట్టిన ధర్మాసనం కలెక్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను అమలు చేయకపోవడం న్యాయ వ్యవస్థను అవమానించడమే” అని న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.