|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 02:00 PM
వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ఎమర్జెన్సీ కోటాను రైల్వే శాఖ తిరిగి అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు ఈ రైళ్లలో మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, డ్యూటీ పాస్ హోల్డర్లకు మాత్రమే ప్రత్యేక కోటాలు ఉండేవి. అయితే ప్రయాణికుల అవసరాలు, బెర్తుల లభ్యత, నిర్వహణ పరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎమర్జెన్సీ కోటాను పునరుద్ధరించాలని నిర్ణయించింది. అత్యవసర ప్రయాణాలకు అనుగుణంగా ఈ కోటా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ అన్ని జోన్లను ఆదేశించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. తాజా సర్క్యులర్ ప్రకారం.. ఏడు లేదా అంతకంటే ఎక్కువ స్లీపర్ కోచ్‌లు ఉన్న అమృత్ భారత్ రైళ్లలో 24 ఎమర్జెన్సీ బెర్తులను తప్పనిసరిగా కేటాయించాలి. అలాగే వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లలో సాధారణ రోజుల్లో నాలుగు బెర్తులు, వారాంతాల్లో ఆరు బెర్తులు ఎమర్జెన్సీ కోటాగా ఉంచాలని సూచించింది. సెకండ్ క్లాస్ ఏసీ కోచ్‌లలో సాధారణ రోజుల్లో 24 బెర్తులు, వారాంతాల్లో 30 బెర్తులు అందుబాటులో ఉంచాలి. థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లలో సాధారణ రోజుల్లో 24 బెర్తులు, వారాంతాల్లో 42 బెర్తులు ఎమర్జెన్సీ కేటగిరీ కింద కేటాయించాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది.