|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 11:57 AM
ఈ తెల్లవారు జామున మణికొండ వద్ద ద్వంసం అయిన 1200 ఎంఎం డయా పిఎస్ సి గ్రావిటీ మెయిన్ పైప్ లైన్ అత్యవసర మరమ్మతుల పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని అధికారులతో చర్చించారు. జలమండలి చేపట్టే మరమ్మతులు పైపు లైన్ విస్తరణ పనులు పూర్తయిన వెంటనే.. రోడ్డు మరమ్మతు పనులు నిర్వహించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరమ్మతుల పనులపై తాజా పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ట్రాన్స్‌మిషన్ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. లీకేజీ వల్ల నీటి సరఫరాలో అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు.ఖానాపూర్ నుండి బోజగుట్ట వరకు వెళ్లే 1200 మిమీ డయా గల పిఎస్ సి గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్ ఈ రోజు తెల్లవారుజామున 2:40 గంటలకు మణికొండలోని నాగులమ్మ దేవాలయం సమీపంలో పగిలినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే మరింత నీటి వృధా జరగకుండా ఉండేందుకు సింగపూర్ మరియు ఖానాపూర్ నుండి నీటి సరఫరాను ఉదయం 3:00 గంటలకు తక్షణమే నిలిపివేశారు.
మరమ్మత్తు పనులను అత్యవసర ప్రాతిపదికన చేపట్టి, ఉదయం 7:00 గంటలకు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. దెబ్బతిన్న పైప్ భాగాన్ని 1150 మి.మీ. వ్యాసం గల ఎమ్ఎస్ బ్యారెల్స్‌ను అమర్చడం ద్వారా మార్పిడి చేస్తున్నారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.. మరమ్మతులు ఈ రోజు సాయంత్రం 7:00 గంటలలోపు పూర్తయ్యే అవకాశం ఉంది. మరమ్మత్తు పనులు పూర్తయ్యిన అనంతరం నీటి సరఫరాను దశలవారీగా పునరుద్ధరించబడుతుంది.
ప్రభావిత ప్రాంతాలు:గండిపేట్, కొకాపేట్, నార్సింగి, మంచిరేవుల, పుప్పాలగూడ, ఖానాపూర్, మణికొండ, షేక్‌పేట్ రిజర్వాయర్ కమాండ్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు.. బోజగుట్ట రిజర్వాయర్ కమాండ్ పరిధిలోని ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.