|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 12:32 PM
మహా శివరాత్రి పర్వదినాన శివుడికి మాదకద్రవ్యాలను నైవేద్యంగా పెడుతున్నట్లు చిత్రీకరించి, సోషల్ మీడియాలో రీల్ చేసిన ముగ్గురు యువకులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని, నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించిన కొద్ది గంటల్లోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే, మహా శివరాత్రి రోజున కొందరు యువకులు శివుడి విగ్రహం ముందు గంజాయిని ఉంచి, దానిని 'ప్రసాదం' అంటూ ఓ వీడియో రీల్ రూపొందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ఘటనపై సీపీ సజ్జనార్ తన 'ఎక్స్' ఖాతా ద్వారా స్పందించారు. "లైక్స్ కోసం లోకాన్ని మరిచి, వ్యూస్ కోసం విలువలను వదిలేస్తారా? ఇది కటకటాల వెనుకకు చేర్చే తీవ్రమైన నేరం. ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించం" అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.సీపీ పోస్టుతో వెంటనే రంగంలోకి దిగిన చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫలక్‌నుమా జంగంమెట్‌కు చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తదుపరి విచారణ నిమిత్తం ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.